Telangana: సీఏం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. సీఎల్పీ నేత భట్టి ఆసక్తికర ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్.. ఈసారి మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత..

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్.. ఈసారి మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని శాసనసభలో తాను చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తీర్మానం చేయించారని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నట్టు ప్రకటించడం సంతోషకరమన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, సమానత్వం, లౌకికవాదం పొందుపరిచి, వీటితో కూడినటువంటి సమాజ నిర్మాణం జరగాలని బలంగా భారత రాజ్యాంగాన్ని అందించే క్రమంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంగా అందులో కూర్చునే ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంబేద్కర్ ఆశించిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నట్లు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కూడా కొత్త పార్లమెంటు భవనానికి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..



