Andhra: ఇక్కడ 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయట
ఒకప్పుడు వీధి దీపాలు కూడా లేని కుగ్రామంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి నేడు భక్తిశ్రద్ధలతో వెలుగులు విరజిమ్ముతోంది. చందన స్వరూపుడైన వాడపల్లి వెంకన్న కటాక్షంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. .. .. ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి.. ఆత్రేయపురం మండలంలో అదో కుగ్రామం. జనాభా కూడా 4000 మాత్రమే. అయితే ఆ ఊరి పేరు నేడు ఖండాంతరాలు దాటిపోతు వెలిగిపోతుంది. ఎందుకంటే అక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు వెలిచి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉన్నారు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒకప్పుడు వీధి దీపాలకు కూడా నోచుకోని ఆ గ్రామం స్వామివారి ఆలయ అభివృద్ధితో నిత్యం విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఔరా అనిపిస్తుంది. గోదావరి తీరప్రాంత నడుమ వాడపల్లి వెంకన్న భక్తులకు కటాక్షంగా మారాడు.. కోరిన కోరికలు తీర్చే చందన స్వరూపుడు వెంకన్నకు భక్తుల తాకిడి అమాంతం పెరుగుతుంది.
ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనపు చెక్కతో చేతిలో గదను ధరించి ప్రత్యేకంగా ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం ఏడాదికి ఒక్కసారే వాడపల్లి తీర్థం పేరున చుట్టుపక్కల గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుండేవారు. నేడు స్వామి వారి మహిమాన్వితుడుగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఒక్క శనివారమే 50 వేల నుంచి 70 వేల వరకు భక్తులు వస్తుండగా మిగతా రోజుల్లో 20వేలకు తగ్గకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు… ఈ క్రమంలో స్వామి వారికి భక్తులు పెరగడంతోపాటు ఆయన ఆదాయము గణనీయంగా పెరిగింది. ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతున్నాయని భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడచిన 28 రోజులలో స్వామివారికి హుండీల నుంచి రూ.1.56 కోట్లు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు. ఇక్కడి వాడపల్లి వెంకన్న ఆదాయం దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆదాయంతో పోటీపడేందుకు పరుగులు పెడుతుంటే అధికారులను సైతం ఔరా అనిపిస్తుంది. ఈ ఆదాయాన్ని బట్టి.. గుడికి పెరుగుతున్న భక్తుల ఆదరణ బట్టి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు శ్రీమంతుడుగా ఎదుగుతున్నాడని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తుల, వి.ఐ.పి.లు, సినీ రాజకీయ ప్రముఖుల తాకిడి పెరుగుతుండడంతో స్వామివారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




