Vizag: యారాడ తీరానికి కొట్టుకువచ్చిన అనుకోని అతిథి.. కానీ కాసేపటికే..!
విశాఖ జిల్లా యారాడ బీచ్ వద్ద భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చి ప్రాణాలు కోల్పోయింది. సుమారు 15 అడుగుల పొడవున్న తిమింగలం కొనఊపిరితో అలల మధ్య కదులుతూ కనిపించగా, మత్స్యకారులు సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. .. .. ..

విశాఖ జిల్లా యారాడ సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. కొనఊపిరితో.. అలల తాకడికి అటు ఇటు కదులుతూ కనిపించింది. దాదాపుగా 15 అడుగుల పొడవున్న ఈ తిమింగలం చూసేందుకు.. అక్కడున్న సందర్శకులు పోటీపడ్డారు. ఆ తిమింగలాన్ని మళ్లీ సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నం చేశారు మత్సకారులు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఒడ్డునే ఆ తిమింగలం ప్రాణాలు కోల్పోయింది. దీంతో సందర్శకులు, మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందారు.
అతిపెద్ద జీవుల్లో ఒకటైన తిమింగలాలు నడిసంద్రంలో సంచరిస్తూ ఉంటాయి. అరుదుగా తీరంలో కనిపిస్తాయి. గాయపడో, లేక అనారోగ్యం పాలై.. ఈదలేని పరిస్థితుల్లో ఇలా ఒడ్డుకు కొట్టుకు వస్తూ ఉంటాయి. గతంలో పలుమార్లు అనకాపల్లి జిల్లాలోనూ తిమింగలాలు కనిపించాయి. ఇలా ఒడ్డుకు వస్తున్న చేపలను మత్స్యకారులు తిరిగి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటువంటి భారీ చేపలు మాత్రం.. తీరానికి వచ్చినప్పుడే కొనఊపిరితో ఉండి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోతాయి. మరికొన్ని చనిపోయిన తర్వాత కళేబరాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సందర్శకులు ఆసక్తిగా వెళ్లి ఆసక్తిగా తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ ఉంటారు. కేవలం టీవీలోనూ, సినిమాల్లోనూ కనిపించే ఈ భారీ తిమింగలాలు ప్రత్యక్షంగా కనిపించేసరికి చూసేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. గాయపడి.. వలకు చిక్కి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




