AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర

Phani CH
|

Updated on: Mar 13, 2026 | 6:10 PM

Share

ఉగాది సమీపిస్తుండగా, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి కర్ణాటక భక్తులు వేల సంఖ్యలో పాదయాత్రగా బయలుదేరారు. 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయక, వందల కిలోమీటర్లు "ఓం నమశ్శివాయ" మంత్రంతో నడుస్తున్నారు. కొందరు కర్రలు కట్టుకుని, మరికొందరు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, పల్లకీలు మోస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి సేవలు అందిస్తూ ఈ భక్తి మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. ఇది నిలువెత్తు భక్తికి నిదర్శనం.

ఉగాది సమీపిస్తున్న వేళ శివభక్తుల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ భక్తుడు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామివారి దర్శనానికి ఏకంగా సాష్టాంగ యాత్ర చేస్తూ వెళ్తే.. ఇప్పుడు ఇంకొందరు భక్తులు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా.. వందల కిలోమీటర్లు పాదయాత్రగా మల్లన్నదర్శనానికి క్యూకడుతున్నారు. ఎర్రటి ఎండ నిప్పులు చెరుగుతున్నా, కాళ్ల కింద నేల సెగలు కక్కుతున్నా.. వారి అడుగులు తడబడవు. ఐదు వందల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం.. అయినా వారి నోట వినిపించేది “ఓం నమశ్శివాయ” అనే మంత్రమే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కర్ణాటక నుంచి వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తుల పాదయాత్ర ఇప్పుడు భక్తికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ పాదయాత్రలో భక్తులు చేస్తున్న సాహసాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొందరు భక్తులు కాళ్లకు ఏకంగా ఎనిమిది అడుగుల పొడవైన కర్రలు కట్టుకుని, అత్యంత కష్టసాధ్యమైన రీతిలో కొండకోనల్లో నడుస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరికొందరు భక్తులు కిలోమీటర్ల మేర సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే, ఇంకొందరు స్వామివారి పల్లకీలను, రథాలను మోస్తూ భక్తిని చాటుకుంటున్నారు. కన్నడిగులు భ్రమరాంబిక దేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామి తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. అందుకే ప్రతి ఏటా ఉగాదికి కొత్త బట్టలు, కానుకలతో అల్లుడి ఇంటికి వెళ్తున్నామన్నంత మమకారంతో ఈ యాత్ర చేస్తారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరూ వెనకడుగు వేయడం లేదు. కాళ్లకు బొబ్బలు వచ్చినా, శరీరం అలసిపోయినా మల్లన్న స్మరణే వారికి అమృతధార అవుతోంది. కర్ణాటక నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు, ఆత్మకూరు, నల్లమల అడవుల గుండా సాగుతూ శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటోంది. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు, దాతలు అన్నదానం, మజ్జిగ, మందులు పంపిణీ చేస్తూ భక్తుల సేవలలో తరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు

Follow Us