AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

Phani CH
|

Updated on: Aug 08, 2026 | 5:47 PM

Share

పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఒక్క కారణమే ఉండదు. తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ లేకపోవడం, చదువు ఒత్తిడి, అధిక అంచనాలు, పోలికలు, ఇంట్లో గొడవలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలు పిల్లలను ప్రభావితం చేయొచ్చు. Positive Parenting ద్వారా పిల్లల మాట వినడం, వారి భావాలను అర్థం చేసుకోవడం, ప్రేమతో క్రమశిక్షణ నేర్పడం ముఖ్యం. పిల్లల్లో ప్రవర్తనా మార్పులను ముందుగానే గుర్తించి, వారికి భరోసా కల్పించడం ద్వారా సమస్యలు తీవ్రమవకుండా చూడవచ్చు.

పిల్లలు.. తల్లిదండ్రులకు ప్రాణం కంటే ఎక్కువ. వాళ్ల భవిష్యత్తు బాగుండాలని.. బాగా చదువుకోవాలని.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు. అందుకోసం పిల్లలను డిసిప్లిన్‌గాపెంచడం, చదువుపై శ్రద్ధ పెట్టించడం, కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం సహజమే. కానీ.. ఈ క్రమంలో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగితే మాత్రం, పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, హైదరాబాద్‌లో పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు పిల్లలు ఇంటికి దూరంగా ఎందుకు పారితున్నారు? తల్లిదండ్రుల పెంపకంలో ఎక్కడ తప్పు జరుగుతోంది? పిల్లలపై ఒత్తిడి ఎంతవరకు కారణమవుతోంది? ఇలాంటి పరిస్థితిని Positive Parenting ద్వారా అడ్డుకోవచ్చా? పిల్లల్లో ముందుగా కనిపించే Warning Signs ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా..పిల్లలు ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారు? అనేది చూస్తే.. పిల్లలు ఇంటికి దూరంగా వెళ్లిపోవడానికి ఏదో ఒక్క కారణమే ఉంటుందని అనుకోవడం తప్పు. ప్రతి పిల్లవాడి పరిస్థితి, కుటుంబ నేపథ్యం, వయసు, ఆలోచనా విధానం వేర్వేరుగా ఉంటాయి. పేరెంట్స్ తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం.. ఇంట్లో తరచూ గొడవలు.. చదువు, పరీక్షల ఒత్తిడి.., తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే భావన.., ప్రేమ, స్నేహ సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలు.. సోషల్ మీడియా ఇంపాక్ట్.. స్వేచ్ఛ కావాలనే కోరిక.. ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా.. ఇంట్లో తమ మాటకు విలువ లేదని, అలాగే, తమ ప్రాబ్లమ్స్ ను అర్థం చేసుకోవడం లేదని పిల్లలు భావిస్తే.. స్వేచ్ఛ కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది.

టీనేజ్‌లో పిల్లల Thinking ఎలా ఉంటుంది?
పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్లలో స్వతంత్రంగా ఆలోచించే తత్వం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా టీనేజ్‌లో.. తమకు ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటారు. ఏది నచ్చలేదో అది ఓపెన్ గా చెప్పాలనుకుంటారు. తమ నిర్ణయాలకు విలువుండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు.. ప్రతి విషయాన్నీ తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే.. పిల్లల్లో ప్రతిఘటన పెరగొచ్చు.

ఇక, పేరెంట్స్ అంచనాల కారణంగా.. పిల్లలపై ఒత్తిడి ఎలా ఉంటుంది?
ప్రతీ పేరేంట్.. తమ పిల్లలు మంచి మార్కులు సాధించాలి.. మంచి కాలేజీలో చదవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి..అని కోరుకుంటారు. కానీ.. ఈ అంచనాలు పిల్లల సామర్థ్యాన్ని మించినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా, ఇతర పిల్లలతో పోల్చడం, తక్కువ మార్కులు వచ్చినప్పుడు అవమానించడం, పదేపదే విమర్శించడం వంటివి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చు. అందుకే క్రమశిక్షణ అవసరమే కానీ.. భయం, అవమానం ద్వారా క్రమశిక్షణ తీసుకురావడం సరైన పద్ధతి కాదు.

Positive Parenting అంటే ఏంటి?
పిల్లల పెంపకంలో Positive Parenting చాలా కీలకం. పిల్లలను కంట్రోల్ చేయడం కంటే.. అర్థం చేసుకోవడం ముఖ్యం. తప్పు చేసినప్పుడు వెంటనే నలుగురి ముందు తిట్టి, అవమానించడం కంటే.. ఆ తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. తల్లిదండ్రులు వారి నిర్ణయాన్ని మాత్రమే చెప్పడం కాకుండా.. పిల్లల అభిప్రాయాన్ని కూడా వినడం చాలా ముఖ్యం. అయితే, Positive Parenting అంటే పిల్లలు ఏం చేసినా వదిలేయడం కాదు. స్వేచ్ఛతో పాటు బాధ్యతను కూడా నేర్పాలి. తప్పును తప్పుగా చెప్పాలి.. కానీ పిల్లలను చెడ్డవాళ్లుగా ముద్ర వేయకూడదు. అదేవిధంగా, పిల్లలు వారి సమస్య చెబుతున్నప్పుడు వెంటనే సలహా ఇవ్వడం కంటే, ముందుగా వాళ్లు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. “స్కూల్‌లో ఇబ్బందిగా ఉంది” అని పిల్లవాడు చెబితే.. “వెంటనే స్కూల్‌కి వెళ్లాల్సిందే” అని చెప్పకుండా.. “అసలేం జరిగిందో” అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే, పిల్లలకు తమ మాట వినేవారు ఇంట్లో ఉన్నారనే నమ్మకం రావాలి. అదే తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. మరో ముఖ్యమైన విషయం..అనేక సందర్భాల్లో.. కోపంలో తల్లిదండ్రులు మాట్లాడే కొన్ని మాటలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. “ఇంట్లో నుంచి వెళ్లిపో”, “నీ వల్ల మా పరువు పోతోంది”, “నువ్వు ఎప్పటికీ మారవు” వంటి మాటలు పిల్లల మనసులో ప్రతికూల భావనను పెంచవచ్చు. అందుకే పిల్లల వ్యక్తిత్వాన్ని విమర్శించకుండా.. వాళ్లు చేసిన పనిని మాత్రమే తప్పుబట్టాలి.. ఆ తర్వాత వాళ్లు అర్ధం చేసుకునేలా నచ్చజెప్పాలి. “నువ్వు చెడ్డవాడివి” అని కాకుండా.. “నువ్వు చేసిన పని సరైంది కాదు.. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని” అడగాలి. ఇక, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నారని ముందే తెలుసుకోవడం ప్రతిసారీ సాధ్యం కాదు. కానీ.. కొన్ని మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడటం తగ్గడం.. ఎక్కువగా ఒంటరిగా ఉండటం.. ఇంట్లో ఉండటానికి ఇష్టపడకపోవడం.. చదువులో ఆకస్మిక మార్పులు.. తరచూ కోపం లేదా చిరాకు.. ఇంటి నుంచి వెళ్లిపోవడం గురించి మాట్లాడటం వంటి మార్పులు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి తప్పనిసరిగా పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతారని అర్థం కాదు. కానీ.. పిల్లలతో దగ్గరగా మాట్లాడాల్సిన అవసరం ఉందనే సంకేతాలుగా చూడాలి. ఇక అన్నింటికి మించి, పిల్లల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. పిల్లలతో మాట్లాడటానికి గంటల సమయం అక్కర్లేదు.. కానీ, రోజులో కొంత సమయాన్ని వాళ్ల కోసం కచ్చితంగా కేటాయించాలి. ఆ టైమ్ లో మీ ఫోన్ పక్కన పెట్టి.. పిల్లలతో ఓపెన్ గా మాట్లాడాలి. “ఈ రోజు ఎలా గడిచింది?” “స్కూల్‌లో ఏం జరిగింది?” “ఏదైనా విషయం నిన్ను బాధపెట్టిందా?” అంటూ మాట్లాడటం మొదలుపెట్టాలి. పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా చెప్పగలిగితే.. సమస్య పెద్దదిగా మారకముందే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా, పిల్లల ఫోన్ వాడకంపై.. స్పష్టమైన, Digital Rules పెట్టి.. ఫోన్ ఎప్పుడు వాడాలి? ఎంతసేపు వాడాలి? అనేది తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. ఆన్‌లైన్ పరిచయాల విషయంలో కూడా, పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకోవాలి. ఇక, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతే ఏం చేయాలి? ముందుగా అతని భద్రతపై దృష్టి పెట్టాలి. ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తుల సహాయం తీసుకుని.. సంబంధిత అధికారిని సంప్రదించాలి. పిల్లవాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా వెంటనే తిట్టడం, కొట్టడం, అవమానించడం చేయకూడదు. మొదట ఏం జరిగింది? ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయావు? అనే విషయాలను తెలుసుకోవాలి. అవసరమైతే వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. ఇక మొత్తంగా చెప్పాలంటే.. పిల్లలను కంట్రోల్ చేయడం కంటే వాళ్లతో స్నేహంగా ఉండాలి. భయపెట్టడం కంటే.. భరోసా ఇవ్వాలి. ప్రేమ, నమ్మకం, భరోసా ఇస్తే.. పిల్లలు తమ సమస్యను తల్లిదండ్రులతో పంచుకుంటారు. అదే వారిని తప్పుదారి పట్టకుండా కాపాడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి!

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ!

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!

Follow Us