AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదరగొట్టిన అడవిబిడ్డలు.. ఢిల్లీలో గిరిజన కళా వైభవం.. రూ.కోటి ఆదాయంతో రికార్డ్

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. మరి ఆ వైవిధ్యానికి నిలువుటద్దం మన గిరిజన కళలు. అడవి బిడ్డల అద్భుతమైన సృజనాత్మకతతో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 అద్భుతంగా జరిగింది. గత 12 రోజులుగా ట్రావెన్‌కోర్ ప్యాలెస్ వేలాది మంది సందర్శకులతో, రంగురంగుల గిరిజన కళాఖండాలతో కళకళలాడింది.

అదరగొట్టిన అడవిబిడ్డలు.. ఢిల్లీలో గిరిజన కళా వైభవం.. రూ.కోటి ఆదాయంతో రికార్డ్
Tribes Art Fest 2026 Concludes In New Delhi
Krishna S
|

Updated on: Mar 13, 2026 | 9:07 PM

Share

భారతదేశ గిరిజన సంస్కృతి, కళా వైభవం, సృజనాత్మకతకు అద్దం పట్టిన 12 రోజుల ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 న్యూఢిల్లీలోని ట్రావెన్‌కోర్ ప్యాలెస్‌లో ఘనంగా ముగిసింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ఉత్సవం.. గిరిజన కళాకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ముగింపు వేడుకను జరుపుకుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు తమ అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రదర్శనకు 10 వేల మందికి పైగా జనం వచ్చారు. గిరిజన కళాకారులు తయారు చేసిన పెయింటింగ్స్, వస్తువులను కొనేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపారు. దీనివల్ల కేవలం 12 రోజుల్లోనే ఏకంగా రూ.1.25 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. సాధారణంగా నెలకు 25 వేలు సంపాదించే కొందరు గిరిజన కళాకారులు, ఈ పండుగ వల్ల ఏకంగా రూ.7 లక్షలు సంపాదించి సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు.

కళాకారుల కలయిక

ఈ ఉత్సవంలో 70 మంది గిరిజన కళాకారులు పాల్గొన్నారు. వీరు తమ పాతకాలపు కళలను ఈ కాలపు ఆధునిక కళాకారులతో కలిసి ప్రదర్శించారు. సుమారు 30 రకాల విభిన్న గిరిజన కళారూపాలను ఇక్కడ చూడవచ్చు. కేంద్ర మంత్రి జువల్ ఓరంతో పాటు కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెఖావత్, దుర్గాదాస్ ఉయ్కే, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

అసలు లక్ష్యం ఏంటి?

గిరిజన కళలు కేవలం బొమ్మలు మాత్రమే కాదు, అవి వారి చరిత్ర, ప్రకృతితో వారికి ఉన్న బంధం. అటువంటి గొప్ప కళలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే, గిరిజన కళాకారులకు మంచి ఆదాయం కల్పించడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రంజనా చోప్రా మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, గిరిజన కళాకారుల ఆర్థిక స్వావలంబనకు ఒక శక్తివంతమైన పునాది అని పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనంత్ ప్రకాష్ పాండే వందన సమర్పణతో ఈ 12 రోజుల వేడుక ముగిసింది.

ఉత్తమ కళాకారులకు సత్కారం

గిరిజన కళా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు:

  • ఉత్తమ కళాకారుడు: రాజేష్ చైత్య వంగడ్
  • యువ సాధకులు: ధనేశ్వర్ ధుర్వే – సుధా కుమారి
  • జీవితకాల సహకారం: పుత్లి గంజు
  • ఆవిష్కరణ పురస్కారం: లైష్రామ్ మెంబి దేవి
  • పునరుజ్జీవన పురస్కారం: బాలసుబ్రమణి

Follow Us