Gas Cylinder Prices: గ్యాస్ సిలిండర్లపై మరో పిడుగులాంటి వార్త.. త్వరలో మరోసారి ధరలు పెంపు..! ఏ క్షణమైనా..
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిమాంగ్ పెరగడం, కొరత ఉన్న క్రమంలో ధరలను మరోసారి పెంచవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. గతంలో కరోనా సమయంలో గ్యాస్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత తగ్గగా.. మరోసారి త్వరలో పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త వాతావరణం క్రమంలో భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ కొరత క్రమంలో డిమాండ్ కారణంగా ధరలను కేంద్రం ఇటీవల పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డొమెస్టిక్ సిలిండర్ ధరపై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 ఒకేసారి పెంచింది. ప్రభుత్వం గ్యాస్ కొరత ఉందనే పుకార్లను తోసిపుచ్చినప్పటికీ.. భయం భయాందోళనలు ప్రజలను పట్టుకున్నాయి. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అక్రమార్కులు గ్యాస్‌ని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ ధరలపై మరో పిడుగులాంటి వార్త వినిపిస్తోంది.
మళ్లీ గ్యాస్ ధరలు పెంపు..?
గ్యాస్ కొరత సంక్షోభం దేశంలో కొనసాగుతూనే ఉంది. గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లు లభిస్తుండగా.. వాణిజ్య సిలిండర్లు మాత్రమే దొరకడం లేదు. యుద్దం మరికొన్ని రోజులు కొనసాగితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత కూడా ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. భవిష్యత్తులో గ్యాస్ దొరకదనే ప్యానిక్‌తో ప్రజల నుంచి గ్యాస్ బుకింగ్ ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల డెలివరీ కూడా ఆలస్యమవుతోంది. బ్లాక్ మార్కెట్, నిల్వ లేకపోవడం వల్ల ప్రజలు గ్యాస్ పొందలేకపోతున్నారు. ఈ భయాందోళన పరిస్థితుల క్రమంలో మరోసారి గ్యాస్ ధరలు పెరగొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల దిగుమతులు తగ్గడం, డిమాండ్ గణనీయంగా పెరిగిన క్రమంలో ధరలు పెరిగే ఛాన్స్ ఉందని ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.
కారణాలేంటి అంటే..?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్దం నిర్విరామంగా కొనసాగుతోంది. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనేది తెలియడం లేదు. యుద్దం మరో 10 రోజులు కొనసాగితే.. భారత్‌లో ఇంధన, గ్యాస్ సరఫరాలు ప్రభావితం అవుతాయి. దీని వల్ల ధరలపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో మరోసారి గ్యాస్ ధరలు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌ను ఆపడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఎల్పీజీ సరఫరాపై నిఘా పెంచాలని, సిలిండర్ల నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. దేశంలో ఇంధన కొరత ఉందని వస్తున్న పుకార్లు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని హోం కార్యదర్శి అధికారులను ఆదేశించారు. భారత్‌లో ఏటా దాదాపు 31.3 మిలియన్ టన్నుల LPG వినియోగం జరుగుతుంది. ఇందులో 87 శాతం గృహ అవసరాలకు ఉపయోగపడుతుండగా.. హోటళ్ళు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలకు మిగతాది వినియోగిస్తున్నారు. కాగా దేశంలో పెట్రోలియం కొరత లేదని ఇవాళ కూడా కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రజలు ఆందోళన పడి గ్యాస్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది.
