Ration Card: ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం నుంచి ఫుల్ క్లారిటీ ఇదిగో.. ముందే జాగ్రత్త పడండి..
రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు, పారదర్శకత తెచ్చేందుకు రేషన్ కార్డు ఈకేవైసీని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వేరే ప్రాంతాల్లో ఉంటున్నవారు ఇప్పటికీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో వారి రేషన్ కార్డు చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

రేషన్ కార్డుదారులు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. కానీ ఇందుకు ఎటువంటి గడువు విధించలేదని స్పష్టం చేసింది. రేషన్ కార్డులో పేరు ఉన్న వ్యక్తులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. లబ్దిదారుల వివరాలను నిర్ధారించడానికి ఈకేవైసీ అవసరమని, తమకు వీలైన సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు.
ఈకేవైసీ తప్పనిసరి
రేషన్ కార్డుదారులు ఈకేవైసీ పూర్తి చేయకపోతే కార్డు రద్దు అవుతుందని, రేషన్ బియ్యం ఇక రాదని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈకేవైసీకి, రేషన్ బియ్యం పంపిణీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవైసీ అనేది లబ్దిదారుల వివరాలను ధృవీకరించడానికి మాత్రమేనన్నారు. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ బియ్యం నిలిపివేయమని, ఎప్పటిలాగే అందిస్తామని తెలిపారు. కేవైసీ అనేది తప్పనిసరి గనుక రేషన్ కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా తమ వేలిముద్రలు, ఐరిష్ ఇచ్చి కేవైసీ పూర్తి చేయాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. భవిష్యత్తులో మీకు రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇది ఉపయోగపడుతుందని వివరించారు.
ఇలా కూడా కేవైసీ చేసుకోవచ్చు
ఒకవేళ దూరపు ప్రాంతాల్లో ఉంటున్నవారు, హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థులు సమీపంలోని రేషన్ డీలర్‌ను సంప్రదించి ఈకేవైసీ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ చెబుతోంది. కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతోంది. ఇందుకోసం గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడే అవసరం ఉండదని అంటోంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ రేషన్ కార్డు వివరాలను చూపించి ఈకేవైసీ చేసుకోవచ్చని, ఈకేవైసీ చేసుకోవడం వల్ల మీకే ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.




