Sarapaka: బైక్‌ను ఢీకొట్టిన స్కూటీ.. డిక్కీ నుంచి కింద పడినవి చూసి అందరూ షాక్..
సారపాకలో జరిగిన రోడ్డు ప్రమాదం గంజాయి అక్రమ రవాణాను బట్టబయలు చేసింది. అతివేగంగా స్కూటీపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరగా మరొకరు పరారయ్యాడు. ప్రమాదంతో అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా స్థానికులను షాక్‌కు గురి చేసింది. రోడ్డుపై స్కూటీ ప్రమాదానికి గురైన దృశ్యం చూసిన స్థానికులు మొదట ఇది సాధారణ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లి చూసే సరికి అసలు విషయం బయటపడడంతో అవాక్కయ్యారు. ప్రమాదంలో గాయాలపాలై ఓ యువకుడు రోడ్డుపై కింద పడిపోగా, మరో యువకుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదానికి గురైన స్కూటీని పరిశీలించిన స్థానికులకు అందులో గంజాయి ఉండటం కనిపించింది. దీంతో ఈ ప్రమాదం వెనుక గంజాయి అక్రమ రవాణా కోణం ఉందని స్పష్టమైంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు అతివేగంగా స్కూటీపై ప్రయాణిస్తూ మరో బైక్‌ని ఢీ కొట్టారు. వేగం అధికంగా ఉండటంతో స్కూటీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో గంజాయి ప్యాకెట్లు రోడ్డుపై పడిపోవడంతో అక్రమ రవాణా విషయం బట్టబయలైంది. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఉపయోగించిన స్కూటీతో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరి కోసం రవాణా చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సారపాక ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేశారు.
