Gadwal: ఈయన ప్రమాదంలో చనిపోయారనుకుంటే హత్య అని తేలింది.. ఆపై నిందితుల విచారణలో మరో ట్విస్ట్
రోడ్డు ప్రమాదంగా అనుకున్న మరణం వెనుక పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్ బయటపడటంతో జోగులాంబ గద్వాల్ జిల్లాలో సంచలనం నెలకొంది. మాజీ సర్పంచ్ భీమా రాయుడిని హత్య చేసేందుకు ప్రత్యర్థి లక్షల రూపాయల ఒప్పందం చేసుకుని కొత్త బోలేరో వాహనం కొనుగోలు చేసి ఢీ కొట్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను కస్టడీలో విచారించగా ఇదే తరహాలో మరొ రెండు హత్యలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

ఆ వ్యక్తి అనుమానాస్పద మరణం కేసులో ట్విస్ట్‌లో మీద ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. మొదట రోడ్డు ప్రమాదంలో మరణించాడని అందరూ భావించారు. కానీ కుటుంబ సభ్యుల అనుమానంతో దర్యాప్తు చేస్తే యాక్సిడెంట్ కాదు పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్ అని తేలింది. మాజీ సర్పంచ్‌ను చంపేందుకు ప్రత్యర్థి ఏకంగా లక్షల రూపాయల ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాదు ఏకంగా బోలేరో వాహనం కొనుగోలు చేసి దానితోనే ఢీ కొట్టి చంపారు. ఇంకా ట్విస్ట్ ఏముంది అనుకునేరు… ఇంకా ఉంది నిందితులను కస్టడీలో విచారిస్తే మరో రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. అవి కూడా ఇదే రకంగా ట్విస్ట్‌లు ఉండడం గమనార్హం.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవంబర్ 21న ధరూర్ మండలం జాంపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ బోలెరో వాహనం వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ భీమా రాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అది ప్రమాదమేనని అందరూ భావించారు. కుటుంబ సభ్యులకు ఎక్కడో తేడా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఖాకీల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జరిగింది రోడ్డు ప్రమాదం కాదని.. పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్ అని పోలీసులు తేల్చారు. భీమా రాయుడుతో ఉన్న పాతకక్షల కారణంగా అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న ఈ హత్య చేయించాడని పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం ఎనిమిది మంది సుపారీ గ్యాంగ్‌తో నిందితుడు రూ.25లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. భీమా రాయుడును హత్య చేసేందుకు కొత్త బోలేరో వాహనం కొన్నారని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన మిల్లు వీరన్నతో పాటు అయన కుమారుడు సురేందర్, సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
రెండు రోజుల పోలీస్ కస్టడీలో వెలుగులోకి మరో రెండు హత్యలు:
సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని భావించారు. దీంతో నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకొని తమదైన శైలిలో విచారంచగా మరో రెండు హత్యలు చేసినట్లు ప్రధాన నిందితుడు మిల్లు వీరన్న అంగీకరించాడు. ఆ హత్యలు సైతం ఒకటి ఆత్మహత్యగా, రెండోది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు మిల్లు వీరన్న. ఇరవై ఏళ్ల క్రితం 2006లో నందిన్నె గ్రామానికి చెందిన ఎర్రప్పను గొంతుమీద కాలుతో తొక్కి చంపి.. పురుగుల మందు తాగించి హత్య చేశాడు. కానీ ఎర్రప్ప ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించారు. దీంతో ఇరవై ఏళ్లుగా ఎర్రప్ప చనిపోయింది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. ఇక 2014లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాయచూరు జిల్లాకు చెందిన బియ్యం వ్యాపారి తాయప్పతో వ్యాపార విభేదాల కారణంగా మిల్లు వీరన్న కక్ష పెంచుకున్నాడు. తాయప్పను శాంతినగర్ సమీపంలోకి తీసుకువచ్చి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉరి వేసి హత్య చేశాడు. ఆ తర్వాత తాయప్ప డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు మిల్లు వీరన్న. దీంతో తాయప్ప మరణం ఇప్పటికీ రోడ్డు ప్రమాదంగానే అనుకుంటున్నారు.
అయితే భీమా రాయుడుని సైతం ఇదే తరహాలో చంపి నేరం నుంచి తప్పించుకుందామని భావించాడు మిల్లు వీరన్న. ఈ సారి చేసిన పాపం పండడంతో పోలీసుల దర్యాప్తులో చిక్కాడు. ఇక పాత రెండు హత్య కేసులకు సంబంధించి తర్వలోనే రీ ఓపెన్ చేసే యోచనలో గద్వాల్ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
