AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vemulawada: ఇప్పుడు గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

కరోనా కనుమరుగైంది. కానీ ఎందరో బాధితుల వ్యథలు ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొందరి జీవితాలను చూస్తే.. బతుకు ఇంత చిధ్రమైందా..? అనే ఆవేదన ఆందోళన కలుగుతుంది. విద్యాధికులైన ఓ జంట.. అయ్యా శివయ్యా.. ఆదుకోవయ్యా అని అర్ధిస్తున్నారు. ఆదరణ లేక.. బతకే ఆధారంలేక .. గుడిమెట్టే దరిగా బతుకీడుస్తున్నారు..!

Vemulawada: ఇప్పుడు గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Advocate Husband And B Com Wife Begging
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 12:30 PM

Share

అమ్మ ఆరోగ్యం కోసం కోటీశ్వరుడు భిక్షటాన చేశాడు.. అది సినిమా. కానీ ఇల్లాలి ఆరోగ్యం కోసం ఓ విద్యాధికుడి దైన్యం చూస్తే.. ఆటగదరా శివా అంటూ కన్నీరు కట్టలు తెగుతుంది. బిచ్చగాడు సినిమా చూసి.. తమకూ మనసుందని కన్నీళ్లు కార్చిన వాళ్లు ఎందరో. కానీ వేములవాడ గుడి నీడలో ఈ ఇద్దరి బతుకు వ్యథ తెలిస్తే రాతి గుండెయినా సరే గుక్క పెట్ట ఏడవాల్సిందే..! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ రాజరాజేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు ఒక దీన గాథ వెలుగులోకి వచ్చింది. అందరినీ కదిలించి వేస్తోంది. కాన్వెంట్ చదువులు, ఉన్నత డిగ్రీలు ఉన్నా.. కాలం చేసిన గాయానికి ఆ దంపతులు నేడు యాచకులుగా మారారు.

వేములవాడ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న వారికి పోలీసులు, అధికారులు కలిసి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఒక జంటను పలకరించిన అధికారులకు నోట మాట రాలేదు. వారు మాట్లాడుతున్న అనర్గళమైన ఇంగ్లీష్, వారి ఆహార్యం చూసి అవాక్కయ్యారు. భర్త జలంధర్ రెడ్డి, లా (LLB) పూర్తి చేసిన మంచి విద్యావంతుడు. సొంతూరు పెద్దపల్లి జిల్లా మంథిని. కరీంనగర్‌లో అడ్వకేట్‌గా పనిచేశారు. జలంధర్‌ రెడ్డి భార్య శిరీష. బీకాం కంప్యూటర్స్‌ కంప్లీంట్‌ చేసి సొంతంగా బిజినెస్‌ కూడా చేసింది. కానీ ఇప్పుడు గుడిలో పెట్టే ప్రసాదంతో దంపతులిద్దరూ బతుకు బండి లాగిస్తున్నారు.

ఈ దంపతులు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. భార్య ఆరోగ్యం క్షీణించడంతో, ఆమెకు తోడుగా ఉంటూ.. రాజన్నే దిక్కని నమ్మి ఇక్కడికి వచ్చారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆ దేవుడి ప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్నారు. నేటి కాలంలో చిన్న కారణాలకే విడిపోతున్న జంటల మధ్య.. భార్య కోసం సర్వం వదులుకుని అండగా నిలిచిన ఆ భర్త ప్రేమ చూసి అధికారులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా ముందు వరకు వీళ్లు అందరిలా ఆనందంగా జీవనం గడిపారు. కానీ.. కుటుంబసభ్యుల అనారోగ్యం.. ఆర్ధిక సమస్యలు వెరసి కరోనా కాలం వీళ్ల జీవితాలను ఇక్కడికి చేర్చింది. ఉన్నత చదువులు చదివిన జలంధర్ రెడ్డి, శిరీషల కథ మన విద్యావ్యవస్థకు, సమాజానికి ఒక హెచ్చరిక.

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మనిషిని ఎంతటి స్థితికైనా దిగజార్చగలవని, కానీ ఆ కష్టాల్లోనూ వీడని వారి బంధం ఒక గొప్ప పాఠమని ఈ ఘటన నిరూపిస్తోంది. ఆస్తులు పోయాయి.. వాటితో పాటే బంధాలు, స్నేహాలు కరిగిపోయాయి. వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ ..పోతే పోనే స్నేహాల్‌..బంధాల్‌ అన్నట్టుగా భార్యకు అండగా నిలిచారు కాసర్ల జలంధర్‌ రెడ్డి. వైద్యం చేయించే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో రాజన్నను నమ్ముకుని వేములవాడ గుడి మెట్లపై జీవనం సాగిస్తున్నారు.

ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్తులున్నా.. ఆదరణ కరువైన వృద్ధులు కేవలం ఈ దంపతులే కాదు. అక్కడ సుమారు 100 మందికి పైగా యాచకులు ఉన్నారు. వారిలో అత్యధికులు వృద్ధులే. వారి గాథలు వింటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. కన్నపిల్లల వేధింపులు, కొందరు కొడుకులు, కోడళ్లు పెడుతున్న హింస భరించలేక ఇక్కడికి చేరిన వారు ఉన్నారు. భయం నీడలో: ఇంటికి వెళ్తే పిల్లలు కొట్టి చంపుతారేమో అన్న భయంతో రాజన్నను ఆశ్రయించారు. “ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి.. కానీ మమ్మల్ని ప్రేమించే మనసున్న మనుషులు లేరు. అందుకే మా రాజన్నే మమ్మల్ని సాకుతున్నాడు” అంటూ ఆ వృద్ధులు బోరున విలపించడం అక్కడి వాతావరణాన్ని విషాదంలోకి నెట్టింది.

కాగా, వీళ్ల ధీనగాథ విన్న పోలీసులు ముందుకు వచ్చారు. ఆలయ పరిసరాల్లో భిక్షాటన నిషేధమని, అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారికి అండగా ఉంటామని అదనపు ఎస్పీ చంద్రయ్య హామీ ఇచ్చారు. “వృద్ధులను ఆదరించకుండా వీధుల్లోకి నెట్టే పిల్లలపై, వారిని వేధించే బంధువులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కౌన్సిలింగ్ ద్వారా వారిని తిరిగి తమ ఇళ్లకు పంపేలా ప్రయత్నిస్తాం” అని ఆయన అన్నారు.

మొత్తానికి దేవుడు కరుణిస్తాడా? ప్రభుత్వం కనికరిస్తుందా? ఆదుకుంటే అందరిలో ఒకరిలా ఉండాల్సిన వారి ఆవేదన. ప్రభుత్వం, సమాజం ఆపన్న హస్తం అందించాలని, వారిని ఓ దరికి చేర్చాలని ఆశిద్దాం..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us