డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..
ఎండాకాలంలో డయాబెటిస్ రోగులు డీహైడ్రేషన్, అధిక చక్కెర స్థాయిల బారిన పడకుండా ఉండటానికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు తీసుకోవడంతో పాటు, రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.

వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డయాబెటిస్ మేనేజ్‌మెంట్ నిపుణులు.. ముఖ్యంగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. వేసవిలో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన అంశాలు ఏంటి..? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం..
వేసవిలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి డీహైడ్రేషన్, మరొకటి రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల. చాలామంది దప్పిక తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు, పుల్ల ఐస్ వంటి వాటిని ఆశ్రయిస్తారు. అయితే, ఈ పానీయాలు, ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. షుగర్ రోగులు వీటిని తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే, అవి చక్కెర స్థాయిలను తక్షణమే పెంచి, డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం ఆ చక్కెరను బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల మూత్రవిసర్జన ఎక్కువై మరింత నీటిని కోల్పోతుంది.
కూల్ డ్రింక్స్‌కు బదులుగా అనేక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు:
కొబ్బరి నీళ్లు: సమ్మర్‌లో లభించే కొబ్బరి నీళ్లలో తీపి తక్కువగా ఉంటుంది. నీరు అధికంగా ఉండే, ముదురని కొబ్బరికాయలను ఎంచుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా, శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
మజ్జిగ: దారిలో దొరికినప్పుడు మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. ఇంటి నుండి వెళ్లేటప్పుడు నిమ్మకాయ, ఉప్పు కలిపి ఒక లీటరు మజ్జిగను ఫ్లాస్క్‌లో తీసుకెళ్లడం వల్ల రోజంతా చల్లగా, శక్తివంతంగా ఉండవచ్చు.
చెరుకు రసం: కూల్ డ్రింక్స్‌తో పోలిస్తే, చెరుకు రసం మంచి ఎంపిక. బయట అనుకోకుండా లంచ్ ఆలస్యమైనప్పుడు, వేరే మార్గం లేనప్పుడు దీనిని ఎంచుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు: పుచ్చకాయ, దోసకాయ (కీరా) వంటివి వేసవిలో అత్యంత ప్రయోజనకరమైనవి. దోసకాయలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది.
నిమ్మరసం: చక్కెర కలపకుండా తయారుచేసిన నిమ్మరసం ఆరోగ్యకరమైన ఎంపిక..
ప్లెయిన్ సోడా: అప్పుడప్పుడు, ప్లెయిన్ సోడాలో నిమ్మకాయ పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం మంచిది. అయితే, రెడీమేడ్ సోడాలలో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించాలి.
ఎండాకాలంలో నీటి వినియోగం ప్రాముఖ్యత:
దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగే అలవాటు మంచిది కాదు. ముఖ్యంగా ఏసీ గదుల్లో పనిచేసే వారికి దాహం తక్కువగా అనిపించినా, శరీరం నీటిని కోల్పోతూనే ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూటీఐలు వచ్చినప్పుడు చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే.. రోజుకు కనీసం మూడు నుండి మూడున్నర లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని సూచిస్తున్నారు.
ప్రత్యేకించి, బయట పని చేసేవారు, బస్సులు లేదా రైళ్లలో ప్రయాణించేవారు.. అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలైన విజయవాడ, నెల్లూరు, కడప, కొత్తగూడెం, అనంతపూర్‌లలో నివసించేవారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రయాణాలలో వాటర్ బాటిల్స్‌తో పాటు మజ్జిగ, ఫ్రూట్ సలాడ్స్ (పుచ్చకాయ, పైనాపిల్, బత్తాయి) వంటివి తీసుకెళ్లడం మంచిది.
తక్కువ చక్కెర స్థాయిలను నివారించడం:
కొన్నిసార్లు హైడ్రేషన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా పడిపోవచ్చు. ఇలాంటప్పుడు తక్షణ శక్తి కోసం చక్కెర లేదా గ్లూకోజ్ పౌడర్‌ను తీసుకోవాల్సి వస్తుంది, ఇది మళ్లీ చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఈ లో-హై సైకిల్‌ను నివారించడానికి ముందుగానే జాగ్రత్త పడటం ఉత్తమం. కూల్ డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. తక్కువ చక్కెర వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
డయాబెటిస్ రోగులు, అలాగే సాధారణ వ్యక్తులు కూడా వేసవిలో కూల్ డ్రింక్స్‌కు 100% దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన పానీయాలు, పండ్లను ఎంచుకోవడం ద్వారా డీహైడ్రేషన్, అధిక చక్కెర స్థాయిల నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, తగినంత నీటి వినియోగం ద్వారా వేసవి కాలాన్ని ఆరోగ్యంగా గడపవచ్చు.
దివ్యాస్త్రం.. ఈ మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు.. మీ ఇంట్లో ఇలా ఈజీగా పెంచుకోండి..
నోట్: ఇది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవ్వడం జరిగింది.. ఏమైనా సందేహాలున్నా.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
