నల్గొండ జిల్లాకి మహర్దశ.. రూ. 74 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి కోమటిరెడ్డి శ్రీకారం
నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి మహర్దశ పట్టనుంది. నియోజకవర్గంలోని దర్వేశ్‌పురంను టూరిజం హబ్‌గా మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో కనగల్ మండలంలో దాదాపు రూ.74 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

నల్గొండ జిల్లా వాసులకు మంత్రి కోమటి రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా నియోజవర్గంలో పర్యటించిన ఆయన రూ..74 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా దర్వేశ్‌పురంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రూ.15 కోట్లతోఆలయ అభివృద్ధి, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి సమీపంలో గెస్ట్ హౌస్, హరిత హోటల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.
రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అంతేకాదు నల్లగొండ బైపాస్ రోడ్ నుంచి మంచినీళ్ల బావి, దర్వేశ్‌పురం, చెర్ల గౌరారం మీదుగా సాగర్ రోడ్ వరకు రూ.37 కోట్లతో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. అలాగే నల్లగొండ – మహబూబ్ నగర్ రోడ్డు నుంచి మైలసముద్రం మీదుగా తెల్లకంటి గూడెం వరకు రూ.21 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఇక దర్వేశ్‌పురంలో మహిళా సంఘాల కోసం నిర్మించిన నూతన భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. అలాగే కనగల్ పట్టణంలో నిర్మించిన మరో రెండు మహిళా సంఘాల భవనాలను సైతం ప్రారంభించారు. దాదాపు రూ.74 కోట్ల నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులతో కనగల్ మండలంలో పలు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరనుందని ఆయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
