AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Car: కొత్త ఎలక్ట్రిక్ కారులో వరుస లోపాలు.. బీవైడీ కార్ల కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు బిగ్‌ షాక్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీవైడీ (BYD)కి హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం కీలక ఆదేశాలను జారీ చేసింది. తాము కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారులో లోపాలు ఉన్నాయని.. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా షోరూం సిబ్బంది సరిచేయలేదని గ్రీన్‌టెక్ సంస్థ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఫోరం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కారు రిపేర్‌ కోసం తనిఖీ బృందాలను పంపించాలని బీవైడీ ఇండియాకు స్పష్టం చేసింది.

Electric Car: కొత్త ఎలక్ట్రిక్ కారులో వరుస లోపాలు..  బీవైడీ కార్ల కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు బిగ్‌ షాక్
Byd India Consumer Court Orde
Anand T
|

Updated on: Nov 26, 2026 | 12:48 PM

Share

తాము కొన్న ఎలక్ట్రిక్ కారులో లోపాలు ఉన్నాయని గ్రీన్‌టెక్ సంస్థ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం, లోపాలున్న వాహనాన్ని విక్రయించారంటూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ MODY BYD, BYD Indiaలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే కారు పరిస్థితిని అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ టీమ్‌ను పంపాలని.. వాహనంలోని లోపాలను సరిచేసి, అవసరమైన పార్ట్స్‌ను ఉచితంగా అమర్చి ఇవ్వాలని తెలిపింది. అలాగే నష్టపరిహారం కింద ఫిర్యాదుదారుకు రూ.25,000, ఖర్చుల నిమిత్తం రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2024 నవంబర్ 13న రూ.32.57 లక్షలు చెల్లించి BYD ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. అయితే కారు డెలివరీ చేసిన కంపెనీ ఆ సమయంలో ఛార్జింగ్ పరికరాలను అందించలేదు. కొనుగోలుదారులు ఈ విషయంపై ప్రశ్నించగా నవంబర్ 30న ఛార్జింగ్ పరికరాలను ఏర్పాటు చేశారని, దీనివల్ల తాము 17 రోజుల పాటు వాహనాన్ని వాడుకోలేకపోయామని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ కారు పనితీరు, ఫీచర్స్‌పై కంపెనీ ఇచ్చిన ప్రకటనలు చూసే కారును కొనుగోలు చేసినట్లు సంస్థ తరఫున అధీకృత ప్రతినిధి జి. మహేశ్ తెలిపారు.

మొదటి నుంచీ సమస్యలే..

కారు కొన్నప్పటి నుంచే దానిలో నిత్యం ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉందని ఆరోపణలు ఉన్నాయి. కారు కొన్న కొన్ని రోజులకే వెనుక సస్పెన్షన్ నుంచి శబ్దాలు రావడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు గ్రీన్‌టెక్ ఆరోపించింది. ఈ విషయాన్ని నవంబర్ 28న డీలర్ దృష్టికి తీసుకెళ్లగా, సాంకేతిక నిపుణులు లోపాలను సరిచేసినట్లు తెలిపారని పేర్కొంది. కానీ ఆ సమస్యలు మాత్రం అలానే కొనసాగాయని, ఎన్నిసార్లు రిపేర్ చేసినా ఆ లోపాలు పరిష్కారం కాలేదని తెలిపింది.

దీంతో 2024 డిసెంబర్ 3న వాహనాన్ని మార్చి ఇవ్వాలని కూడా కోరినట్లు సంస్థ చెప్పుకొచ్చింది. అయితే 2025 జనవరి 2న మరోసారి టెస్ట్ డ్రైవ్ చేయగా, ఈసారి సస్పెన్షన్‌తో పాటు స్టీరింగ్‌ వ్యవస్థ నుంచి కూడా శబ్దాలు వచ్చినట్లు మహేశ్ పేర్కొన్నారు. ఇవే కాదు.. కంపెనీ పేర్కొన్న ప్రీ-డెలివరీ ఇన్‌స్పెక్షన్ (PDI) నివేదిక, సిరామిక్ కోటింగ్ వివరాలు, వారంటీ పత్రాలు, యాక్సెసరీస్ కిట్, ఫ్రీ సర్వీస్ కూపన్లు కూడా ప్రొవైడ్ చేయలేదని గ్రీన్‌టెక్ ఆరోపించింది.

వాహనాన్ని పరిశీలించనున్న నిపుణుల బృందం

దీనిపై విచారణ జరిపిన ఫోరం.. కారులోని అన్ని సమస్యలను క్లియర్ చేసి, దాని పనితీరు, ఫిట్‌నెస్‌ను చెక్‌ చేసి అంతా పర్ఫెక్ట్‌గా ఉందో లేదో తనిఖీ చేసిన తర్వాతే ఆ కారును వినియోగదారుడికి అందించాలని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం నెల రోజుల్లో కంప్లీట్ చేయాలని పేర్కొంది.

రీఫండ్ లేదా వాహనం మార్పుపై ఫోరం వ్యాఖ్యలు

వాహనానికి పలుమార్లు రిపేర్ చేసినంత మాత్రాన పూర్తి రీఫండ్ లేదా కొత్త వాహనం ఇవ్వాలని ఆదేశించలేమని విచారణ సందర్భంగా ఫోరం అభిప్రాయపడింది. వాహనంలో అంతర్గతంగా ఉన్న, సరిచేయలేని తయారీ లోపాన్ని నిర్ధారించే సాంకేతిక ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది. లోపాలను పూర్తిగా సరిచేసి వాహనాన్ని తిరిగి అందించాలని తెలిపింది. కారు రోడ్డుపై నడిచేందుకు సిద్ధంగా ఉందనే ధ్రువీకరణ పత్రంతో పాటు, రిపేర్ చేసిన కొత్త పార్ట్స్‌కు వారంటీ కూడా పొడిగించాలని పేర్కొంది.

Follow Us