AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమించడమే పాపమా?.. పరువు పేరుతో కూతురిని కడతేర్చిన తండ్రి

ఒకవైపు కూతురి పెళ్లి సందడి.. మరోవైపు నిశ్చితార్థానికి ఏర్పాట్లు. ఇంకో రెండు రోజుల్లో ఎంగేజ్‌మెంట్ జరగాల్సిన ఇంట్లో అంతలోనే విషాదం అలుముకుంది. కన్నకూతురి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన తండ్రి.. ఆమె ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక, కుటుంబ పరువు పోతుందనే భావనతో తన కూతురినే కడతేర్చాడు. ఆపై హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ పరువు హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.

Telangana: ప్రేమించడమే పాపమా?.. పరువు పేరుతో కూతురిని కడతేర్చిన తండ్రి
Ather Strangles Daughter Over Love Affair
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 26, 2026 | 11:48 AM

Share

పెళ్లికి ముందు ప్రేమవ్యవహారం బయటకు రావడంతో కన్నకూతురినే కడతేర్చాడు ఓ తండ్రి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సుమిత్ర దంపతులకు 18 ఏళ్ల కుమార్తె కళ్యాణి ఉంది. కుటుంబ సభ్యులు ఇటీవలే ఆమెకు పెళ్లి సంబంధం ఖాయం చేశారు. ఈ నెల 25న నార్నూర్‌కు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. దీంతో ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నెల 23న కళ్యాణి ప్రవర్తనలో మార్పును గమనించిన తండ్రి ఏమైందని ప్రశ్నించారు.

ప్రేమించిందనే కక్షతో..

అదే రోజు ఉదయం తల్లిదండ్రులతో పాటు కళ్యాణి, మరో బాలుడు పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లారు. కొద్దిసేపటికే కడుపునొప్పిగా ఉందంటూ కళ్యాణి ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కూతురిని నిలదీశారు. తండ్రి కైలాస్ గట్టిగా ప్రశ్నించడంతో తనకు మేనత్త కుమారుడితో ప్రేమ సంబంధం ఉన్నట్లు కళ్యాణి వెల్లడించింది. దీంతో కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కుటుంబ పరువు పోతుందనే భావనతో కూతురిపై కక్ష పెంచుకున్నాడు తండ్రి.

మంగళవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న వేళ కైలాస్ కూతురు కళ్యాణి గదిలోకి వెళ్లాడు. అక్కడ ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు.

ఆగమేఘాల మీద అంత్యక్రియలు..

ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రలేచిన తల్లి.. కూతురు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తొలుత కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని భావించారు. అయితే మరణించిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయడం అనుమానాలకు తావిచ్చింది. పెళ్లికాని యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన తీరుపైనా గ్రామంలో చర్చ మొదలైంది. ఈ పరిణామాలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో బయటపడిన అసలు నిజం

పోలీసులు తండ్రి కైలాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మేనత్త కుమారుడితో కూతురికి ప్రేమ సంబంధం ఉందని తెలుసుకున్నానని, కుటుంబ పరువు పోతుందనే కారణంతో తానే గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీఐ వెల్లడించారు. తొలుత ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసిన తండ్రి.. చివరకు పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పరువు పేరుతో ప్రాణం తీసిన పాపాత్ముడు

కూతురి పెళ్లి గురించి కలలు కన్న ఆ ఇంట్లో.. నిశ్చితార్థానికి ముందే చావు మృదంగం మోగింది. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూతురి మనసును అర్థం చేసుకోవాల్సిన తండ్రి.. ఆ ప్రేమనే నేరంగా భావించి ప్రాణాలు తీశాడన్న ఆరోపణలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. కుటుంబ గౌరవం, పరువు, సంప్రదాయాల పేరుతో మనుషుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ప్రేమను అంగీకరించలేని ఆలోచనలు చివరకు ఒక యువతి జీవితాన్నే బలితీసుకున్నాయి. నిశ్చితార్థపు మేళతాళాలు వినిపించాల్సిన ఇంట్లో ఇప్పుడు కన్నీటి రోదనలు మిగిలాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us