Telangana: వాడు శ్రీశైలం వెళ్లేటప్పుడు బస్సులో పరిచయం.. ఆ తర్వాత ఇంతకు తెగిస్తారు అనుకోలేదు..
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో పాటు, ముంపు పరిహారంగా వచ్చిన రూ.18 లక్షలపై ఆశతో ఓ భార్య ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. కూలి పని ఉందని నమ్మించి భర్తను అవురుపల్లి శివారుకు రప్పించిన ప్రియుడు.. మద్యం మత్తులో బండరాయితో దాడి చేసి హత్య చేశాడు.

కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో పాటు, ముంపు పరిహారంగా వచ్చిన రూ.18 లక్షలపై కన్నేయడంతో ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. ఇద్దరూ కలిసి భర్తను హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అవురుపల్లి శివారులో వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ పశువుల కాపరిగా జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన అంజమ్మను వివాహం చేసుకున్నాడు. రెండు నెలల క్రితం మల్లికార్జున్ బస్సులో శ్రీశైలం వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారడంతో శివ తరచూ మల్లికార్జున్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అంజమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇదిలా ఉండగా.. ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితుడిగా మల్లికార్జున్‌కు ఇటీవల రూ.18 లక్షల పరిహారం అందింది. అప్పటికే వివాహేతర సంబంధంలో ఉన్న అంజమ్మ, శివ కన్ను ఆ డబ్బులపై పడింది. భర్త అడ్డు తొలగితే తమ సంబంధానికి అడ్డంకి ఉండదని, పరిహారం సొమ్మును కూడా చెరిసగం పంచుకోవచ్చని ఇద్దరూ భావించారు. దీంతో మల్లికార్జున్‌ను హత్య చేసేందుకు పథకం రచించారు.
ఈ నెల 20న శివ తన ప్లాన్‌ను అమలు చేశాడు. కూలి పని ఉందంటూ మల్లికార్జున్‌కు ఫోన్ చేసి అవురుపల్లి శివారుకు రప్పించాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న మల్లికార్జున్‌పై శివ బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు రోజుల అనంతరం అటుగా వెళ్తున్న కొంతమంది కూలీలు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తొలుత గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా భావించి అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతుడు మల్లికార్జున్‌గా గుర్తించారు. ఆ తర్వాత హత్య వెనుక అతడి భార్య అంజమ్మ, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న శివ పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటం, ముంపు పరిహారం డబ్బులపై ఆశతోనే ఈ హత్యకు పథకం వేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న శివ, అంజమ్మ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
