ఇష్టం లేకపోయినా చేశా ఆ పాత్రలు చేశా.. చాలా విమర్శలు వచ్చాయి.. క్షమాపణలు కూడా చెప్పాను
ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం, సినీ అనుభవాలపై మనసువిప్పి మాట్లాడారు. "నా ఆస్తి నా బాల్యం, నా ఊరు, నా గ్రామం" అని ఆయన స్పష్టం చేస్తూ, తన గ్రామీణ నేపథ్యంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. తన నిజమైన ఆస్తులు భౌతికమైనవి కావని, తన బాల్య స్మృతులు, జన్మభూమిపై ఉన్న ప్రేమ అని అన్నారు.

హైదరాబాద్‌లో తన నటనా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తరచుగా తన స్వగ్రామాన్ని సందర్శిస్తారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రెండు, మూడు రోజుల గ్యాప్ దొరికితే, స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఊరికి వెళ్తానని చెప్పారు. అక్కడ తన తల్లి, తమ్ముడు, కుటుంబ పొలాలు మాత్రమే కాకుండా, బాల్యంలో తనతో కలిసి చదువుకున్న సహాధ్యాయులు ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటూ ఉండటం తనకు సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. తన ఊరు, ఊరి పక్కన ఉన్న అలుగువాగు, ఊరగొండ వంటి స్థలాలు తనకు ప్రపంచంలోనే అత్యంత అందమైనవని, అవి తన అనుబంధానికి గుర్తుగా నిలుస్తాయని రాకేష్ శర్మ స్పేస్ నుంచి భారతదేశాన్ని చూసి “సారే జహా సే అచ్ఛా” అన్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ వివరించారు.
తన గ్రామీణ అనుబంధాన్ని హైదరాబాద్‌లోని తన నివాసంలో కూడా కొనసాగిస్తానని ధర్మవరపు తెలిపారు. తన ఇంటివద్ద నులక మంచం, నవార్ మంచం వాడుతూ, మేడ మీదకు వేపచెట్టును పెంచానని, దాని వేపపుల్లలతో దంతాలు శుభ్రం చేసుకుంటూ, తన సొంత ఊరిలో ఉన్న భావనను కల్పించుకుంటానని వివరించారు. పూలకు నీళ్ళు పోయడం, కలుపు తీయడం వంటి పనులు స్వయంగా చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతానని చెప్పారు. నైట్ పార్టీలకు, వాటికి దూరంగా ఉంటానని, 1994 తర్వాత అలాంటి అలవాట్లకు పూర్తిగా దూరమయ్యానని తెలిపారు.
తన సినీ కెరీర్‌లో ఎక్కువగా లెక్చరర్ పాత్రలు పోషించడంపై వచ్చిన ప్రశ్నలకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు. సినిమా పరిశ్రమలో ఒకరు విజయం సాధిస్తే మిగిలిన వారు అదే బాటలో నడవడానికి ప్రయత్నిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను చిత్రంలో లెక్చరర్ పాత్ర విజయవంతమైన తర్వాత, సుమారు 30-40 చిత్రాలలో అలాంటి పాత్రలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ లెక్చరర్ పాత్రలు కొన్నిసార్లు విద్యా వ్యవస్థను, గురువులను కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయని, ఈ విషయంలో తాను బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపారు. దర్శకులు చెప్పిన విధంగా నటించాల్సి వస్తుందని, కొన్నిసార్లు తనకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్రలు చేయాల్సి వచ్చిందని వివరించారు. తన వల్ల అటువంటివి జరగకూడదని తాను ఇప్పటికీ బాధపడతానని, అందుకే ఇప్పుడు అలాంటి పాత్రలను తగ్గించేశానని స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




