AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రేడ్ డీల్ కుదరకపోతే 25 శాతం టారిఫ్‌లు.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారత్, చైనా సహా 14 వాణిజ్య భాగస్వాములపై కొత్త టారిఫ్‌లు విధించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే 25 శాతం సుంకాలు విధించే అవకాశముందని సమాచారం. ఈ పరిణామాలు భారత ఎగుమతులు, ఫార్మా, స్టీల్, మెడికల్ పరికరాల రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్రేడ్ డీల్ కుదరకపోతే 25 శాతం టారిఫ్‌లు.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్!
Us India Trade Deal
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2026 | 10:07 AM

Share

అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య సుంకాల విషయంలో మరోసారి దూకుడు పెంచారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 దేశాలపై కొత్త టారిఫ్‌లు విధించేందుకు రంగం సిద్ధం చేశారు. భారత్, చైనా, బంగ్లాదేశ్‌, కంబోడియా, ఈయూ, ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, మలేసియా, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం దేశాలపై టారిఫ్‌ కత్తి దుయ్యబోతున్నారు. అయితే.. ఈ జాబితా నుంచి మెక్సికో, నార్వేను మినహాయించారు. తయారీ రంగంలో ఆయా వాణిజ్య భాగస్వాములు డిమాండ్‌కు మించి తయారీని, ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీనివల్ల అమెరికా కంపెనీలతో పోలిస్తే ఆయా కంపెనీలకు ధరల విషయంలో ఎడ్జ్‌ లభిస్తోందని చెప్తోంది.

చైనా ఉత్పత్తులపై 45 శాతం టారిఫ్‌ల విధించేందుకు ప్లాన్‌

ప్రత్యేకించి.. అమెరికా తన ప్రధాన వాణిజ్య ప్రత్యర్థి చైనాపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు కసరత్తు చేస్తోంది. చైనా ఉత్పత్తులపై ఏకంగా 45 శాతం వరకు భారీ టారిఫ్‌ల కొరడా ఝుళిపించబోతోంది. చైనా తక్కువ ధరలకు భారీగా వస్తువులను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లలోకి పంపుతోందని అమెరికా మండిపడుతోంది. ఈ క్రమంలోనే.. చైనాపై అదనపు సుంకాన్ని ప్రతిపాదించింది. వాషింగ్టన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే.. చైనాపై అదనంగా 20 శాతం సుంకం విధించాలని, గరిష్ఠంగా 40 శాతానికి చేర్చాలని ట్రంప్‌ యంత్రాంగం ప్రతిపాదనలు చేస్తోంది. అలాగే.. వియత్నాంపై 35 శాతం, భారత్‌ సహా ఇతర దేశాలపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌, వియత్నాం మాత్రమే వాషింగ్టన్‌తో ఇంకా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేదు. అందుకే.. అదనుచూసి టారిఫ్ ప్రతిపాదనలతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో పైచేయి సాధించాలని అమెరికా భావిస్తోంది.

భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే 25 శాతం సుంకాలు

ఇక.. ట్రంప్‌ టారిఫ్‌ల మోత మోగించేందుకు రెడీ అవుతున్న వేళ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ నెలకొంది. భారత్‌తో ట్రేడ్‌ డీల్ కుదిరితే ఓకే.. కుదరకపోతే ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా తేల్చిచెప్పింది. అయితే, తయారీ రంగంలో భారత్‌కు ‘నిర్మాణాత్మక అదనపు ఉత్పత్తి సామర్థ్యం’ (Structural Excess Capacity) ఉందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దేశంలోని ఏ రంగంలోనూ అలాంటి అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని స్పష్టం చేసిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్యపరమైన అంశాలను ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించింది.

యూఎస్‌టీఆర్ నోటీసులను పరిశీలిస్తున్నాం:

భారత్ సహా 14 దేశాల తయారీ రంగాల్లో అదనపు ఉత్పత్తి సామర్థ్యం, విధానాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) ‘సెక్షన్ 301’ కింద చేపట్టిన విచారణ, జారీ చేసిన నోటీసులపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించింది. “యూఎస్‌టీఆర్ విడుదల చేసిన నోటీసును భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం దీనిని లోతుగా పరిశీలిస్తున్నాం” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మొత్తంగా, తమ దేశీయ పరిశ్రమలకు మేలు చేసేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అమెరికా సమర్థించుకుంటోంది. అయితే.. అమెరికా విధిస్తున్న ఈ కొత్త టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై గట్టిగానే పడనుంది. దేశంలో కీలకమైన ఫార్మాస్యూటికల్స్, మెడికల్ పరికరాలు, స్టీల్, సోలార్ ఎనర్జీతో పాటు ఐటీ రంగాలపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా.. 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్‌ సర్కారు మరోసారి టారిఫ్‌ల మోత మోగించేందుకు సిద్ధమవుతుండటం ట్రేడ్‌ వర్గాల్లో హీట్‌ పెంచుతోంది.

Follow Us