AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అణుదాడి చేస్తాం.. మెద్వెదేవ్ సంచలన హెచ్చరిక! 

Preventive Nuclear Attack: ప్రపంచవ్యాప్తంగా అణుయుద్ధ భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడదని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో రష్యా ముందస్తు అణుదాడి  చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో పాటు దానికి మద్దతుగా నిలుస్తున్న నాటో దేశాలు కొన్ని హద్దులు దాటాయని, దీంతో అణ్వాయుధాల వినియోగంపై మాస్కో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

అణుదాడి చేస్తాం.. మెద్వెదేవ్ సంచలన హెచ్చరిక! 
Russias Medvedev Issues Nuclear Warning
Sharada V
|

Updated on: Nov 26, 2026 | 10:44 AM

Share

భారీ స్థాయిలో అణ్వాయుధేతర ఆయుధాలను ఉపయోగించి విధ్వంసం సృష్టిస్తే, దానికి ప్రతిస్పందనగా రష్యా ముందస్తు అణుదాడి చేసే అవకాశం ఉంటుందని ‘మాస్కో జర్నల్ ఆఫ్  లా’ లో ప్రచురితమైన ఓ వ్యాసంలో మెద్వెదేవ్ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు రహస్యంగా ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను సరఫరా చేసే అవకాశం కూడా రష్యాకు ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే మాస్కో తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని హెచ్చరించారు.

అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ కీలక నిర్ణయం

ఉక్రెయిన్, దాని పశ్చిమ దేశాల మిత్రపక్షాలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుందని మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. కొన్ని పరిస్థితుల్లో అణ్వాయుధాలను ఉపయోగించే హక్కు రష్యాకు ఉందని  వ్యాసంలో రాసినట్లు TASS వెల్లడించింది. అయితే అణుదాడి విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొందరపడి నిర్ణయం తీసుకోరని మెద్వెదేవ్ అన్నారు. అణ్వాయుధాల వినియోగానికి ముందు ఎదురయ్యే పరిణామాలను పుతిన్ జాగ్రత్తగా అంచనా వేస్తారని తెలిపారు.

మరో వైపు రష్యా అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోందని జర్మన్ నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘స్పుత్నిక్-ఎస్’ (Sputnik-S) పేరున్న ఉపగ్రహాన్ని డిసెంబర్‌లో ప్రయోగించే అవకాశం ఉందని జర్మనీ నాటో మిత్రదేశాలను అప్రమత్తం చేసింది. సమాచారం. ఈ పరిణామంతో యూరప్ దేశాల్లో ఆందోళన మొదలైంది.

అంతరిక్షంలో అణు పేలుడు జరిగితే ఏమవుతుంది?

అంతరిక్షంలో అణ్వాయుధాన్ని పేల్చడం భూమిపై అణు దాడితో పోలిస్తే భిన్నమైన పరిణామాలు ఎదురుకావచ్చు.  భారీ స్థాయిలో విద్యుదయస్కాంత తరంగాల (Electromagnetic Pulse – EMP) ప్రభావంతో ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు పనిచేయకుండా పోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దీని ప్రభావం కేవలం అంతరిక్షానికే పరిమితం కాదు. మనం రోజూ ఉపయోగించే GPS సేవలు, ఫోన్ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్, నావిగేషన్ వ్యవస్థలు అంతరాయానికి గురయ్యే అవకాశం ఉంది. వాతావరణ అంచనాలు, విమానయానం, నౌకాయానం, సైనిక సమాచార వ్యవస్థలపైనా ప్రభావం పడుతుంది.

అమెరికా ఆందోళనలకు మరింత బలం!

రష్యా అంతరిక్షంలో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల అణ్వాయుధ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్న ఆరోపణలు గతంలో అమెరికా నుంచి వచ్చాయి. ఇప్పుడు అణ్వాయుధాన్ని మోసుకెళ్లే ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతోందన్న వార్తలు ఆ ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చాయి. మరోవైపు ఈ ఆరోపణలను క్రెమ్లిన్ తోసిపుచ్చింది.

అంతరిక్షంలో అణ్వాయుధాలపై నిషేధం లేదా?

వాస్తవానికి అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపును నిరోధించేందుకు 1967లోనే అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో అణ్వాయుధాలు, ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించకూడదు. అయినప్పటికీ అంతరిక్షంలో సైనిక ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ కొనసాగుతోంది.

అంతరిక్షంలో అణ్వాయుధ పోటీని అడ్డుకునేందుకు 2024లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, జపాన్ కలిసి ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అన్ని దేశాలు 1967 అంతరిక్ష ఒప్పందానికి కట్టుబడి ఉండాలని అందులో కోరాయి. ఈ తీర్మానానికి భద్రతా మండలిలోని 13 దేశాలు మద్దతు తెలిపాయి. రష్యా మాత్రం వీటో అధికారాన్ని ఉపయోగించి వ్యతిరేకించింది. చైనా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉపగ్రహాలపై ఆధారపడుతున్న ఆధునిక ప్రపంచంలో వాటిని లక్ష్యంగా చేసుకునే ఆయుధ వ్యవస్థలు అభివృద్ధి చెందడం అంతర్జాతీయ భద్రతకు కొత్త సవాలుగా మారుతోంది.

Follow Us