AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ ఇదేం వింత.. ఒకదాని తర్వాత మరొకటి.. రెండు కార్లు ఢీకొట్టడంతో గాల్లో పల్టీలు..! ఐనా బతికిపోయాడు

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరం సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న సాలిక నవీన్‌ను ఒకదాని తర్వాత మరొకటి రెండు కార్లు ఢీకొట్టాయి. దీంతో ఆయన గాల్లో పల్టీలు కొట్టి దాదాపు వంద మీటర్ల దూరంలో పడిపోయారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్వల్ప గాయాలతో లేచి తన బైక్‌ను తీసుకుని వెళ్లిపోయారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

బాబోయ్ ఇదేం వింత.. ఒకదాని తర్వాత మరొకటి.. రెండు కార్లు ఢీకొట్టడంతో గాల్లో పల్టీలు..! ఐనా బతికిపోయాడు
Man Flung Into Air After Two Cars Hit His Bike, Walks Away
Srilakshmi C
|

Updated on: Nov 26, 2026 | 6:47 AM

Share

తూర్పుగోదావరి, నవంబర్ 26: రోడ్డు ప్రమాదం జరిగితే చిన్నపాటి గాయాలైనా ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఒక వ్యక్తి ప్రయాణిస్తున్న బైక్‌ను ఒకదాని తర్వాత మరొకటి రెండు కార్లు బలంగా ఢీకొంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక ఆ వ్యక్తి గాల్లో పల్టీలు కొట్టి దాదాపు వంద మీటర్ల దూరంలో పడితే ప్రాణాలతో బయటపడటం కష్టమేనని ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ ప్రమాదంలో మాత్రం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడిన వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంతేకాదు.. తన బైక్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అసలేం జరిగింది?

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరం సమీపంలోని ఏడీబీ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోటకు చెందిన సాలిక నవీన్‌ పెదరాయవరంలోని తన అత్తగారి ఇంట్లో ఉంటున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సమీపంలోని ఓ రొయ్యల మేత తయారీ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. రోజూ ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం నవీన్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కంపెనీకి సెలవు పెట్టి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పెదరాయవరం సమీపంలోని ఏడీబీ రహదారిపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మలుపు తిరిగారు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా వచ్చిన రెండు కార్లు వరుసగా ఆయన బైక్‌ను ఢీకొట్టాయి. మొదటి కారు ఢీకొట్టిన వెంటనే నవీన్‌ అదుపుతప్పి గాల్లోకి ఎగిరిపడ్డారు. ఆ తర్వాత మరో కారు కూడా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ధాటికి ఆయన గాల్లో పల్టీలు కొడుతూ దాదాపు వంద మీటర్ల దూరంలో పడిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆయనకు తీవ్ర గాయాలై ఉంటాయని స్థానికులు భావించారు. ప్రాణాలతో బయటపడటం కూడా కష్టమేనని అనుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకుని ఆయన పరిస్థితిని పరిశీలించారు.

అయితే అక్కడే అసలు ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ప్రమాదంలో గాల్లో ఎగిరిపడి దూరంగా పడిన నవీన్‌ కొద్దిసేపటికే లేచి నిలబడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడిన ఆయన తన బైక్‌ వద్దకు వెళ్లి దానిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నారు. పెదరాయవరం సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. రెండు కార్లు వరుసగా బైక్‌ను ఢీకొట్టడం, నవీన్‌ గాల్లో పల్టీలు కొట్టి దూరంగా పడిపోవడం వంటి దృశ్యాలు అందులో కనిపించాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో తీవ్ర గాయాలు కావడం లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ నవీన్‌ మాత్రం అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడటంతో పలువురు ఆయనను మృత్యుంజయుడిగా అభివర్ణిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, రహదారులపై ప్రయాణించేటప్పుడు మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండటం, వేగాన్ని నియంత్రించుకోవడం ఎంతో అవసరం. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Follow Us