AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. అంతలోనే చెదిరిన పెళ్లి కల.. ప్రియురాలు మృతి!

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ప్రేమజంటకు ఊహించని విషాదం ఎదురైంది. హైదరాబాద్‌లోని సీఐఐ జంక్షన్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి డివైడర్‌, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జైపుర్‌కు చెందిన 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సుష్మా చౌదరి మృతి చెందారు. మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. అంతలోనే చెదిరిన పెళ్లి కల.. ప్రియురాలు మృతి!
Hyderabad Bike Accident
Srilakshmi C
|

Updated on: Nov 26, 2026 | 6:33 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 26: ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యుల అంగీకారం లభించడంతో కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని కలలు కన్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ప్రేమకథ విషాదాంతంగా ముగిసింది. స్నేహితుడి ఇంట్లో భోజనం చేసి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం యువతి ప్రాణాలను బలిగొంది. కాబోయే భార్యను కళ్లముందే కోల్పోయిన యువకుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

ప్రేమించి.. పెళ్లికి సిద్ధమై..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపుర్‌కు చెందిన సుష్మా చౌదరి (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నగరంలోని ఖాజాగూడలో ఓ సంస్థలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కొతిలి అక్షయ్‌ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి, వారి అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుష్మా చౌదరి, అక్షయ్‌ కుమార్‌ ఇద్దరూ కలిసి కావూరిహిల్స్‌లో నివసిస్తున్న తమ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత, సుమారు ఒంటిగంట సమయంలో ద్విచక్ర వాహనంపై కొండాపూర్‌కు బయలుదేరారు.

వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం సీఐఐ జంక్షన్‌ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత సమీపంలోని చెట్టును కూడా బలంగా ఢీకొట్టినట్లు పోలీసుల కథనం. ఈ ప్రమాదంలో బైక్‌ వెనుక కూర్చున్న సుష్మా చౌదరి రోడ్డుపై పడిపోయారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఆమె పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే సుష్మాను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మరోవైపు ద్విచక్ర వాహనం నడుపుతున్న అక్షయ్‌ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో అతడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. త్వరలో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలో ప్రియురాలు దూరం కావడంతో విషాదంలో మునిగిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్న ప్రేమజంటలో ఒకరిని రోడ్డు ప్రమాదం శాశ్వతంగా దూరం చేసింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొనడం అందరినీ కలచివేస్తోంది.

Follow Us