AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsAppలో కొత్త ఫీచర్.. ఫొటోలే కాదు టెక్ట్స్‌ మెసేజ్‌లకు కూడా ఆ ఆప్షన్‌

వాట్సప్‌లో వ్యక్తిగత సమాచారం, రహస్య విషయాలు ఇతరులతో షేర్ చేసుకునేటప్పుడు ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు చాలామందికి ఉంటాయి. మనం పంపిన మెసేజ్‌లను అవతలి వ్యక్తులు స్క్రీన్‌షాట్ తీయడం, కాపీ చేసుకోవడం, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా వాట్సప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలకు మాత్రమే అందుబాటులో ఉన్న View Once ఆప్షన్‌ను టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

WhatsAppలో కొత్త ఫీచర్.. ఫొటోలే కాదు టెక్ట్స్‌ మెసేజ్‌లకు కూడా ఆ ఆప్షన్‌
Whatsapp View Once Text Messages Feature
Nikhil
|

Updated on: Nov 26, 2026 | 6:30 AM

Share

View Once ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు పంపించే కొన్ని ప్రత్యేక మెసేజ్‌లను అవతలి వ్యక్తులు ఒక్కసారి మాత్రమే చదవగలరు. మెసేజ్‌ను ఓపెన్ చేసి చదివిన తర్వాత తిరిగి చూడటానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా ఆ మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీయడం, కాపీ చేయడం, ఫార్వర్డ్ చేయడం వంటి వాటిని కూడా నిరోధించేలా ప్రైవసీ పరిమితులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను iPhone యూజర్ల కోసం పరీక్షిస్తున్నట్లు సమాచారం.

iPhone బీటా యూజర్లకు అందుబాటులోకి..

ఫీచర్ ట్రాకర్ WABetaInfo సమాచారం ప్రకారం, WhatsApp iOS Beta వెర్షన్ 26.45.10.73 ఉపయోగిస్తున్న కొంతమంది యూజర్లకు View Once Text ఆప్షన్ కనిపిస్తోంది. Apple TestFlight ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉండటంతో ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో లేదు. పరీక్షలు పూర్తయిన తర్వాత సాధారణ యూజర్లకు కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ ఫీచర్ ఉపయోగించాలంటే చాట్‌లో మెసేజ్ టైప్ చేసిన తర్వాత Send బటన్‌ను సాధారణంగా నొక్కకుండా కాసేపు ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు మెసేజ్‌ను షెడ్యూల్ చేయడం లేదా View Once మోడ్‌లో పంపడం వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో View Once ఎంచుకుంటే మెసేజ్ ఆ విధానంలో పంపబడుతుంది. ఈ ఫీచర్ మీ అకౌంట్‌కు అందుబాటులోకి వచ్చినప్పుడు చాట్ బార్ పైన WhatsApp నోటిఫికేషన్ చూపించే అవకాశం ఉంది.

మెసేజ్ ఓపెన్ చేస్తే ప్రత్యేక విండో..

View Once Text మెసేజ్‌ను అవతలి వ్యక్తి ఓపెన్ చేసినప్పుడు ప్రత్యేకమైన విండోలో కనిపిస్తుంది. ఆ సమయంలో స్క్రీన్‌షాట్ తీయడం, స్క్రీన్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాకుండా పరిమితులు ఉంటాయి. అలాగే టెక్స్ట్‌ను కాపీ చేయడం, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, సేవ్ చేసుకోవడం వంటి ఆప్షన్లు కూడా ఉండవు.

మెసేజ్ చదివిన తర్వాత ఆ ప్రత్యేక విండోను క్లోజ్ చేస్తే టెక్స్ట్ మాయమవుతుంది. తిరిగి దాన్ని ఓపెన్ చేసి చదవడానికి అవకాశం ఉండదు. వ్యక్తిగత వివరాలు, తాత్కాలికంగా మాత్రమే షేర్ చేయాలనుకునే సమాచారం పంపించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే అవతలి వ్యక్తి మరో కెమెరాతో స్క్రీన్‌ను ఫొటో తీయడం వంటి మార్గాలను పూర్తిగా అడ్డుకోలేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మొత్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే WhatsAppలో ప్రైవసీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Follow Us