డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. కిషన్ రెడ్డి నషా ముక్త్ భారత్ పాదయాత్రలో గోపీచంద్ సందడి
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్ర రెండో రోజు ఉత్సాహంగా కొనగుతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధ్యమని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్ర రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ముషీరాబాద్ నుంచి ప్రారంభమైన ఇవాళ్టి పాదయాత్రలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొని మద్దతు తెలిపారు. నషా ముక్త్ భారత్ కోసం కిషన్ రెడ్డి సంకల్పం అభినందనీయమని కొనియాడారు. గురువారం అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద ముగియనున్న ఈ యాత్ర, శుక్రవారంతో ముగుస్తుంది.
2029 నాటికి నషా ముక్త్ భారత్ సాధ్యమే:
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాము చేపట్టిన పాదయాత్రకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రజల్లో వస్తున్న ఈ చైతన్యాన్ని చూస్తుంటే 2029 నాటికి నషా ముక్త్ భారత్ లక్ష్యం కచ్చితంగా సాధ్యమే అనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్తులో ఉన్న వ్యక్తుల కారణంగా సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు బానిసలైతే వారి భవిష్యత్తుతో పాటు ఆ కుటుంబం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మత్తు పదార్థాలు మనిషిలోని ప్రతిభను (టాలెంట్), ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని పేర్కొన్న ఆయన, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే .. కిషన్ రెడ్డి పాదయాత్రకు చిరంజీవి సైతం మద్దతు తెలిపారు. పాదయాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
