6 ఏళ్ల వయసుకే.. 80 ఏళ్ల వృద్ధురాలిలా రూపం.. చిట్టితల్లికి ఎందుకీ కష్టం..?
కేరళలోని వయనాడ్‌కు చెందిన ఆరేళ్ల ఐసా క్యూటిస్ లాక్సా అనే అరుదైన జన్యు రుగ్మతతో బాధపడుతోంది. 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపించే ఈ చిన్నారికి డాక్టర్ కావాలన్నది కల. పుట్టినప్పటి నుంచీ ఎన్నో ఆరోగ్య సవాళ్లు, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐసా, ఆమె తల్లిదండ్రుల పోరాటం ఈ కథనం.

చిన్నారుల ప్రపంచం ఆటపాటలు, స్నేహాలు, సరదాలతో నిండి ఉంటుంది. కానీ కేరళలోని వయనాడ్‌కు చెందిన ఆరేళ్ల ఐసా బాల్యం మాత్రం ఆసుపత్రులు, వైద్య పరీక్షలు, ఇతరుల వింత చూపుల మధ్య సాగుతోంది. ఆమె శరీరంపై కనిపించే ముడతలను చూసి కొందరు ఆశ్చర్యంగా చూస్తుంటే.. మరికొందరు ఎగతాళి చేశారు. అయినా ఐసా మాత్రం తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. పెద్దయ్యాక డాక్టర్ కావాలని, తనలాంటి పిల్లలకు వైద్యం చేయాలని ఆశపడుతోంది.
‘నన్ను చూసి అందరూ ఎందుకు అలా చూస్తున్నారు?’
ఐసా పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తొలినాళ్లు అంత సులభంగా సాగలేదు. ఆమె రూపాన్ని చూసిన కొందరు పిల్లలు ‘అమ్మమ్మ’ అంటూ పిలిచేవారు. దీంతో చిన్నారి మనసు నొచ్చుకుంది. తనను చూసి అందరూ ఎందుకు అలా చూస్తున్నారని, తనతో ఎందుకు స్నేహం చేయడం లేదని తల్లిని ప్రశ్నించేది.
కూతురు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను కలిసి వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ విద్యార్థులకు ఐసా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు. దీంతో తోటి పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఐసాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
అసలు సమస్య ఏంటంటే..
ఐసా శరీరంపై ఏర్పడిన ముడతలు సాధారణ చర్మ సమస్య వల్ల వచ్చినవి కావు. ఆమె ‘క్యూటిస్ లాక్సా’ (Cutis Laxa) అనే అరుదైన జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా చర్మం బిగుతును కోల్పోయి వదులుగా మారుతుంది. ఫలితంగా ఆమె వయసుకు మించిన వృద్ధురాలిలా కనిపిస్తోంది.
ఐసాకు ఆరు నెలల వయసు వచ్చినా శరీరంపై ముడతలు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. జన్యు పరీక్షలు చేయించిన తర్వాత నెల రోజులకు వచ్చిన నివేదికలో ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు వెల్లడైంది. అప్పటివరకు తమ బిడ్డకు తరచూ వస్తున్న అనారోగ్య సమస్యలకు కారణం ఏమిటో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.
చిన్న వయసులోనే శస్త్రచికిత్సలు
ఐసా చిన్నప్పటి నుంచి తరచూ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేది. నెలలో ఎక్కువ రోజులు ఆసుపత్రుల్లోనే గడపాల్సి వచ్చేది. ఒక్కో నెలలో రెండు మూడు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. రెండున్నరేళ్ల వయసులోనే ఆమెకు రెండు ఆపరేషన్లు నిర్వహించారు.
ఐసాకు చికిత్స అందిస్తున్న డాక్టర్ అంజన వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యూటిస్ లాక్సా ప్రభావం చర్మానికే పరిమితం కాకపోవచ్చు. వ్యాధి రకాన్ని బట్టి గుండె, శ్వాసకోశ వ్యవస్థ, ఇతర అంతర్గత అవయవాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కొన్ని రకాల వ్యాధుల్లో ఆయుష్షుపైనా ప్రభావం పడవచ్చు. ప్రస్తుతం ఈ సమస్యను పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేదు. వ్యాధి లక్షణాలను, వాటి వల్ల వచ్చే సమస్యలను నియంత్రించడమే వైద్యుల ముందున్న మార్గం.
భవిష్యత్తులో ఐసాకు కండరాల నొప్పులు, శారీరక కదలికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరుగెత్తడం, దూకడం వంటి కార్యకలాపాలు కష్టమవ్వవచ్చని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. డాన్స్, పాటలు, పెయింటింగ్ వంటి వాటిపైనా పరిమితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.
ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. భారత్‌లో ఏడు కేసులే!
క్యూటిస్ లాక్సా ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కుటుంబాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ప్రతి 20 లక్షల మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉందని అంచనా. భారత్‌లో ఇలాంటి కేసులు కేవలం ఏడు మాత్రమే ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబాలకు ఈ సంస్థ వైద్యపరమైన సమాచారంతో పాటు మానసిక మద్దతును కూడా అందిస్తోంది.
నెలకు రూ.12,500 ఆదాయంతో వైద్య ఖర్చుల భారం
ఐసా కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు మరో పెద్ద సవాలుగా మారాయి. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం సుమారు రూ.1.50 లక్షలు మాత్రమే. అంటే నెలకు సగటున రూ.12,500 ఆదాయంతో కుటుంబ అవసరాలు, చిన్నారి వైద్య ఖర్చులను భరించాల్సి వస్తోంది.
ఈ వ్యాధి గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు తీవ్రంగా కలత చెందానని ఐసా తండ్రి చెబుతున్నారు. చిన్నారి శరీరంపై కనిపించే మార్పులను చూసి బాధపడ్డానని, వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదని తెలిసినప్పుడు తట్టుకోలేకపోయానని వివరించారు. అయినప్పటికీ కూతురి భవిష్యత్తుపై ఆశలు వదులుకోలేదు. ఐసా తెలివైనదని, చురుగ్గా ఉంటుందని, స్నేహితులకు సాయం చేస్తుందని గర్వంగా చెబుతున్నారు.
40 వేల మందికి చేరిన చిన్నారి కథ
ఐసాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ ఆసక్తిని గమనించిన పొరుగున ఉండే అర్జున్ 2024లో ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఖాతాను 40 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. తనలోని ప్రతిభను, సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తమ కూతురిని ఇంటికే పరిమితం చేయకుండా ఆమె ఎలా ఉందో అలాగే ప్రపంచానికి పరిచయం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. నెగెటివ్ కామెంట్స్ తగ్గి, ఆమెను చూసే విధానంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.
ఐసా తన అనారోగ్య పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే వయసులో లేదు. కానీ తన భవిష్యత్తు గురించి మాత్రం ఓ స్పష్టమైన కల ఉంది. డాక్టర్‌గా మారి తనలాంటి పిల్లలకు చికిత్స అందించాలనుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష మధ్య కూడా కూతురి ధైర్యమే తమకు కొండంత బలమని తల్లిదండ్రులు చెబుతున్నారు. “నా బిడ్డ ఇలాగే ఉంది. తను ఇలాగే బయటకు వెళ్తుంది. ప్రజలు ఆమెను చూడాలి. నా కూతురే నా జీవితం” అంటూ తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తున్నారు.
