AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిబట్టలతో ఓయో రూమ్‌కు వెళ్లిన జంట.. యువతి ఫుడ్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయగా..

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు.. అనూహ్యంగా ఉరికొయ్యకు వేలాడాడు. చేతిలో పుస్తెలు, ఒంటిపై పెళ్లి బట్టలు సిద్ధంగా ఉన్నాయి.. కానీ ఆ యువకుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కేపీహెచ్‌బీలోని ఓయో రూమ్‌లో చోటుచేసుకున్న ఈ గుండెల్ని పిండేసే ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పెళ్లిబట్టలతో ఓయో రూమ్‌కు వెళ్లిన జంట.. యువతి ఫుడ్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయగా..
Groom Ends Life In Oyo Room
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 06, 2026 | 8:56 AM

Share

ప్రేమించిన యువతితో ఏడడుగులు వేయాలని కలలు కన్నాడు.. పెళ్లి బట్టలు కొనుక్కున్నాడు.. ముహూర్తం దగ్గర పడుతుండగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు, అనూహ్యంగా ఉరికొయ్యకు వేలాడాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా చెర్లోపల్లి గ్రామానికి చెందిన వనమాల లోకేష్, చింతల్ గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గండిమైసమ్మలోని హెటిరో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అంబిక అనే యువతితో పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా.. లోకేష్ కుటుంబం అంగీకరించింది కానీ అంబికా కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా నిరాకరించారు.

పెళ్లి బట్టలతోనే తనువు చాలించి..

పెద్దలు అంగీకరించకపోయినా వివాహం చేసుకోవాలని లోకేష్ నిశ్చయించుకున్నాడు. ఇందుకు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించి పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు పంపించారు. ఆ డబ్బుతో లోకేష్, అంబికా కలిసి పెళ్లి బట్టలు, పుస్తెలు కూడా కొనుగోలు చేశారు. యువతి కుటుంబ సభ్యుల నుండి ముప్పు పొంచి ఉందన్న భయంతో వారు శుక్రవారం కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీలోని ఫ్లాగ్ షిప్ సౌత్ పాయింట్ రెసిడెన్సీలో గది తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో అంబికాను భోజనం తీసుకురావాలని బయటకు పంపించిన లోకేష్, గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తాను కొనుక్కున్న పెళ్లి బట్టలు ధరించి, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భోజనంతో తిరిగి వచ్చిన అంబికా గది తలుపులు తీయడానికి ప్రయత్నించగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చిన ఆమె హోటల్ సిబ్బంది సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా, లోకేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే లోకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. యువతి కుటుంబ సభ్యుల నిరాకరణే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us