AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasha Mukt Bharat: ఒక్కటే జీవితం.. వ్యసనాలతో నాశనం చేసుకోవద్దు.. యువతకు చిరంజీవి, కిషన్ రెడ్డి పిలుపు..

యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రకటిస్తూ హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ ఉద్యమంలో సినీ పరిశ్రమ ప్రముఖులు భాగస్వాములై యువతలో స్ఫూర్తి నింపారు. నషా ముక్త్ భారత్ అనేది ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, 70 కోట్ల మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమమని కిషన్ రెడ్డి అన్నారు.

Nasha Mukt Bharat: ఒక్కటే జీవితం.. వ్యసనాలతో నాశనం చేసుకోవద్దు.. యువతకు చిరంజీవి, కిషన్ రెడ్డి పిలుపు..
Nasha Mukt Bharat Concludes In Hyderabad
Krishna S
|

Updated on: Nov 27, 2026 | 9:52 PM

Share

డ్రగ్స్ అనే మహమ్మారి బారిన పడకుండా చిన్నారులు, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మద్యం, మాదకద్రవ్యాలు వంటి చెడు అలవాట్లు చాలాసార్లు మొహమాటం వల్లే మొదలవుతాయని, అలాంటి ప్రలోభాలను మొదటిసారే నిర్మోహమాటంగా తిరస్కరించాలని యువతకు దిశానిర్దేశం చేశారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంతమంది ప్రలోభపెట్టినా మత్తుపదార్థాల వైపు కన్నెత్తి కూడా చూడొద్దని చిరంజీవి సూచించారు.

తాను కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి వాటికి ఎంతో దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. మనిషికి దక్కేది ఒక్కటే జీవితమని, దాన్ని వ్యసనాలతో నాశనం చేసుకోకుండా సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. మన యుద్ధం కేవలం మాదకద్రవ్యాలపై మాత్రమేనని, వాటికి అలవాటు పడిన బాధితులపై కాదని స్పష్టం చేశారు. డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న వారిని నేరస్తులుగా చూసి శిక్షించకుండా, ప్రేమతో ఆ వ్యసనం నుంచి బయటపడేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నషా ముక్త్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న కిషన్ రెడ్డి స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు.

ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. 70 కోట్ల యువత భవిష్యత్తు: కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నషా ముక్త్ భారత్ అనేది ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, దేశంలోని 70 కోట్ల మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమమని స్పష్టం చేశారు. ప్రపంచంలో మరే దేశానికి లేని యువశక్తి మన సొంతమని, వారు తప్పుదారి పడితే దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారిని కేవలం ప్రభుత్వ సమస్యగా చూడకుండా, ప్రతి కుటుంబం తమ సొంత సమస్యగా భావించి పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యసనపరులను మార్చేందుకు దేశవ్యాప్తంగా డి-అడిక్షన్ కేంద్రాలను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, ఇందులో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

ఉత్సాహంగా సాగిన మూడో రోజు పాదయాత్ర.. కదిలిన టాలీవుడ్

అంతకుముందు హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్ నినాదంతో కిషన్ రెడ్డి చేపట్టిన మూడో రోజు పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అమీర్‌పేట్ గురుద్వారాలో నటులు సాయికుమార్, శివారెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం సత్యం థియేటర్ నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ యాత్రలో భాగమై, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. సినీ తారలు, యువత, బీజేపీ శ్రేణుల నినాదాల మధ్య సాగిన ఈ పాదయాత్ర జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ వద్ద ముగిసింది.

Follow Us