Bhatti Vikramarka: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
Bhatti Vikramarka: రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశంలోని అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులో ఉంచి, విద్యుత్ ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి..

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఢిల్లీలోని అశోకా హోటల్లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, ప్రభుత్వ విద్యుత్ బకాయిల చెల్లింపు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
రూ.25,096 కోట్ల డీపీఆర్‌లకు కేంద్రం ఆమోదం తెలపాలి
రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (RDSS) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ.25,096 కోట్ల విలువైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఈ ఏడాది మే 27న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.72 కోట్ల బడ్జెట్ సహాయం మాత్రమే అందిందని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల బిల్లింగ్ సామర్థ్యం మెరుగుపడుతోందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపడంతో పాటు 2028 మార్చి 31 వరకు పనుల అమలుకు పూర్తి గడువు కల్పించాలని కోరారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సహాయం
92 గిగావాట్ అవర్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం కోసం రూ.14,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి స్వాగతించారు. అయితే, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఈ ఆర్థిక సహాయం అందే అవకాశం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలని కోరారు. టీజీజెన్కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) త్వరితగతిన ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం టెండర్లు చేపట్టిన 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల్లో పారదర్శకత అవసరం
అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసారానికి సంబంధించిన జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (GNA) విధానానికి తెలంగాణ మద్దతు ఇస్తోందని, అయితే ప్రసార ఛార్జీల్లో భారీ హెచ్చుతగ్గులు రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు.తెలంగాణకు 5,801 మెగావాట్ల నెట్వర్క్ యాక్సెస్‌లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ, 2025 అక్టోబర్‌లో రూ.195 కోట్లు, నవంబర్‌లో రూ.145 కోట్ల మేర ప్రసార ఛార్జీలు విధించారని తెలిపారు. రాష్ట్రాల వారీగా విద్యుత్ ప్రసార ఛార్జీల లెక్కింపును ప్రతి నెలా వెల్లడించాలని, మెగావాట్‌కు వార్షిక ప్రాతిపదికన ఛార్జీలను నిర్ణయించి, ఏడాదికి ఒక్కసారి సర్దుబాటు చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇప్పటికే చెల్లించిన బిల్లులను పునరాలోచించి అదనపు ఛార్జీలు విధించే విధానానికి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణాది విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి
దక్షిణ భారతదేశానికి 6,000 మెగావాట్ల విద్యుత్‌ను అందించే రాయ్‌గఢ్–పుగళూర్–త్రిస్సూర్ హెచ్వీడీసీ విద్యుత్ ప్రసార వ్యవస్థకు పూర్తిస్థాయిలో జాతీయ హోదా కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.తెలంగాణ విద్యుత్ ప్రసార ప్రణాళికలో భాగమైన 23,480 ఎంవీఏ సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులకు తొలి విడతలోనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలోని సేడం నుంచి తెలంగాణలోని పరిగి వరకు నిర్మించనున్న 400 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ ప్రసార లైన్, 765/400 కేవీ మహేశ్వరం–2 సబ్‌స్టేషన్ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ప్రాజెక్టులుగా చేపట్టి, వాటి వ్యయాన్ని జాతీయ స్థాయిలో పంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
2030 మార్చి వరకు ప్రసార ఛార్జీల మినహాయింపు పొడిగించాలి
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల దశలవారీ మినహాయింపు గడువు 2028 జూన్ 30తో ముగుస్తోందని, అయితే ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు 2029 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఆమోదించిన విద్యుత్ వనరుల సమృద్ధి ప్రణాళిక మేరకు రాష్ట్రాలు సమకూర్చుకునే విద్యుత్ సామర్థ్యానికి 2030 మార్చి 31 వరకు ప్రసార ఛార్జీల మినహాయింపును పొడిగించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో 2026 సెప్టెంబర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే సుమారు 20 శాతం తగ్గగా, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 13.3 శాతం పెరిగిందని వివరించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో సుమారు 560 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ నిల్వ వ్యవస్థలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని వేగంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
వేసవిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను వినియోగించాలి
రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశంలోని అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులో ఉంచి, విద్యుత్ ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 11 ప్రకారం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖతో సమన్వయం చేసుకుని ముందస్తుగా గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని ఏ ఒక్క రాష్ట్రంపైనా మోపకుండా ఉమ్మడి విధానం ద్వారా భరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.
