ప్రియుడి కోసం భర్తను..? ములుగులో షాకింగ్ ఘటన!

×

ప్రియుడి కోసం భర్తను..? ములుగులో షాకింగ్ ఘటన!

ములుగు జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన నిజంగా షాకింగ్‌కు గురిచేస్తోంది. ఒక భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పునేం నాగరాజు తన భార్య జ్యోతితో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో జ్యోతికి బేస్తగూడెం గ్రామానికి చెందిన గుడారపు సత్యతో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం భర్త నాగరాజుకు తెలియడంతో ఆయన తన భార్యను పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయితే, భర్త నాగరాజు తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన జ్యోతి, తన ప్రియుడు సత్య, ప్రశాంత్ అనే మరో వ్యక్తితో కలిసి నాగరాజు హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి నాగరాజును గొంతు బిగించి హత్య చేసి, ఆ తర్వాత దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, నాగరాజు బంధువులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య జ్యోతితో పాటు గుడారపు సత్య, ప్రశాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Phani CH