కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే స్వామి అనుగ్రహం మీ సొంతం!
Karthika Saturday Lord Venkateswara Pooja Telugu: కార్తీక మాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం విశేషంగా భావిస్తారు. తిరుమల వెళ్లలేని భక్తులు ఇంట్లోనే స్వామివారిని ఎలా పూజించాలి? ఏ మంత్రాన్ని జపించాలి? ఎలాంటి నైవేద్యం సమర్పించాలి? పూర్తి పూజా విధానం తెలుసుకోండి.

Karthika Saturday Lord Venkateswara Pooja Telugu: కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు విశేష ఫలితాలను ఇస్తాయని హిందూ సంప్రదాయంలో భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం లేనివారు కూడా ఇంట్లోనే వేంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు. ఇందుకోసం కార్తీక శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం పూజా మందిరాన్ని అందంగా అలంకరించి, వేంకటేశ్వర స్వామి ఫొటో లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. స్వామివారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజను ప్రారంభించాలి.
శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలను స్వామివారికి సమర్పించడం విశేష ఫలప్రదంగా భావిస్తారు. అనంతరం స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ‘ఓం నమో వేంకటేశాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే కుటుంబ సభ్యులందరూ కలిసి గోవింద నామాలను పఠించాలి. విష్ణు సహస్రనామం లేదా వేంకటేశ్వర సుప్రభాతం చదవడం కూడా మంచిదని భక్తులు భావిస్తారు.
పూజ సమయంలో స్వామివారికి పాలు, బెల్లం, పండ్లు లేదా చిన్న పొంగలిని నైవేద్యంగా సమర్పించవచ్చు. అనంతరం హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను కుటుంబ సభ్యులకు అందించాలి. సాయంత్రం తులసి కోట దగ్గర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి, తులసి మాతను పూజించాలి.
అంతేకాదు, కార్తీక శనివారం రోజున పేదలకు అన్నదానం చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో పుణ్యప్రదమైన కార్యాలుగా భావిస్తారు. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో పూజలు, దానధర్మాలు ఆచరిస్తూ స్వామివారిని స్మరించుకోవడం ద్వారా జీవితంలో సుఖశాంతులు, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల వెళ్లలేకపోయినా స్వచ్ఛమైన మనసుతో ఇంట్లోనే శ్రీనివాసుడిని కొలిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చని భక్తులు నమ్ముతారు.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పూజా విధానాలు, ఆచారాలు హిందూ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతీయ ఆచారాలను బట్టి పూజా విధానాల్లో మార్పులు ఉండవచ్చు.)




