AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavad Gita: భగవద్గీతలోని నాలుగో అధ్యాయం చదివితే ఇన్ని పుణ్యఫలాలా? శాపవిమోచనం కలిగించిన పురాణ గాథ!

Bhagavad Gita Chapter 4 Story Telugu:భగవద్గీతలోని నాలుగో అధ్యాయానికి ఎంతో విశిష్టమైన మహిమ ఉందని పద్మ పురాణం చెబుతోంది. ఈ అధ్యాయాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పారాయణం చేస్తే పాపాలు, దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇద్దరు అప్సరసలు రేగి చెట్లుగా మారి, గీతా పారాయణ మహిమతో తిరిగి తమ రూపాలను ఎలా పొందారో తెలుసుకుందాం.

Bhagavad Gita: భగవద్గీతలోని నాలుగో అధ్యాయం చదివితే ఇన్ని పుణ్యఫలాలా? శాపవిమోచనం కలిగించిన పురాణ గాథ!
Bhagavad Gita Chapter 4 Story Telugu
Rajashekher G
|

Updated on: Nov 26, 2026 | 8:47 PM

Share

Bhagavad Gita Chapter 4 Story Telugu: భగవద్గీత.. శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక గ్రంథం. కురుక్షేత్ర యుద్ధభూమిలో కర్తవ్యాన్ని మరిచి, మానసిక ఆందోళనకు గురైన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల సమాహారమే భగవద్గీత. ఇందులోని ప్రతి అధ్యాయం మనిషికి జీవిత సత్యాలను, ధర్మ మార్గాన్ని, కర్మ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అయితే భగవద్గీతలోని నాలుగో అధ్యాయానికి ప్రత్యేకమైన మహిమ ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అధ్యాయాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం వల్ల ఘోరమైన శాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఒక పురాణ గాథ వివరిస్తోంది. ఇంతకీ ఆ కథ ఏమిటి? నాలుగో అధ్యాయ పారాయణం వెనుక ఉన్న విశేషం ఏంటో తెలుసుకుందాం.

భగవద్గీత నాలుగో అధ్యాయ మహిమ

పద్మ పురాణంలో భగవద్గీత నాలుగో అధ్యాయం పారాయణ మహిమను తెలియజేసే ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయంలో భరతుడు అనే మహనీయుడు నివసించేవాడు. ఆయన ప్రతిరోజూ ఎంతో భక్తిశ్రద్ధలతో భగవద్గీత నాలుగో అధ్యాయాన్ని పారాయణ చేసేవాడు. ఆధ్యాత్మిక సాధన ఫలితంగా సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, కష్టనష్టాలకు చలించకుండా సమబుద్ధితో జీవించేవాడు.

ఒకరోజు మహాత్ములను దర్శించుకోవాలనే కోరికతో భరతుడు పర్యటనకు బయలుదేరాడు. ప్రయాణంలో ఒకచోట సాయంత్రం కావడంతో రెండు పెద్ద రేగి చెట్ల కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఎప్పటిలాగే అక్కడ కూడా భగవద్గీత నాలుగో అధ్యాయాన్ని భక్తితో పారాయణ చేశాడు. అనంతరం అక్కడ కనిపించిన రెండు రేగి పండ్లను తన సంచిలో వేసుకుని ప్రయాణం కొనసాగించాడు.

ఇవి కూడా చదవండి

రేగి చెట్లుగా ఉన్న అప్సరసలకు శాపవిమోచనం

భరతుడు వెళ్లిన ఐదు రోజుల తర్వాత ఆ రెండు రేగి చెట్లు ఎండిపోయాయి. వాటిలోని జీవులు మరోచోట ఇద్దరు బాలికలుగా జన్మించారు. అయితే వారికి గత జన్మ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కొంతకాలానికి భరతుడు ఒక గ్రామంలో పర్యటిస్తూ ఆ బాలికల ఇంటికి చేరుకున్నాడు. వారు ఆయనకు సాదరంగా ఆతిథ్యం ఇచ్చి, తమ పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించారు.

పూర్వం గోదావరి తీరంలో సత్యతవుడు అనే మహర్షి ఘోర తపస్సు చేసేవాడు. ఆయన తపస్సుకు భయపడిన ఇంద్రుడు, ఇద్దరు అప్సరసలను పంపించి తపస్సుకు భంగం కలిగించమని ఆదేశించాడు. ఇంద్రుడి ఆజ్ఞతో వచ్చిన అప్సరసలపై మహర్షి ఆగ్రహించి, వారిని గంగా తీరంలో రేగి చెట్లుగా మారిపోవాలని శపించాడు. తమ తప్పును క్షమించి శాపవిమోచనం కలిగించాలని అప్సరసలు వేడుకోవడంతో మహర్షి శాంతించాడు. భవిష్యత్తులో భరతుడు ఆ చెట్ల నీడన కూర్చుని భగవద్గీత నాలుగో అధ్యాయాన్ని పారాయణం చేస్తాడని, ఆ పారాయణను వినడం వల్ల వారికి శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు.

భగవద్గీత పారాయణ ఫలంతో స్వర్గలోకానికి!

మహర్షి చెప్పినట్లుగానే భరతుడు చేసిన పారాయణను విన్న తర్వాత వారు చెట్ల రూపాన్ని విడిచి బాలికలుగా జన్మించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భరతుడు వారికి భగవద్గీత నాలుగో అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేయాలని సూచించాడు. వారు అలాగే ఆచరించడంతో పుణ్యఫలంగా తిరిగి తమ అప్సరసల రూపాలను పొంది స్వర్గలోకానికి చేరుకున్నారని పద్మ పురాణ గాథ వివరిస్తోంది.

ఈ కథ ద్వారా భగవద్గీత పారాయణకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో అధ్యాయాన్ని భక్తితో పఠించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మజ్ఞానం, ధర్మబద్ధమైన జీవనంపై అవగాహన కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

(Disclaimer: ఈ కథనం పద్మ పురాణంలో పేర్కొన్న పురాణ గాథలు, హిందూ ధార్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడింది. ఇందులోని అంశాలను ఆధ్యాత్మిక విశ్వాసాల కోణంలో మాత్రమే చూడగలరు.)

Follow Us