కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ క్రైమ్ విభాగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వెబ్ వాడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చాలామంది కార్యాలయాల్లో లేదా బయట కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ తెరిచి పని పూర్తయ్యాక కేవలం బ్రౌజర్ ట్యాబ్‌ను మాత్రమే మూసివేస్తుంటారు. అయితే అలా చేసినంత మాత్రాన వాట్సాప్ లాగౌట్ అవ్వదని, అది అలాగే లాగిన్ అయి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఆ కంప్యూటర్‌ను ఉపయోగించే ఇతరులు లేదా సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత సందేశాలను, గ్రూప్ చాట్‌లను చూడడమే కాకుండా, మీ నంబర్ నుండి మీ స్నేహితులకు మెసేజ్‌లు పంపి డబ్బులు కాజేసే మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల, ముఖ్యమైన డాక్యుమెంట్లు, సమాచారాన్ని వాట్సాప్ వెబ్ ద్వారా షేర్ చేయవద్దని సైబర్ క్రైమ్ విభాగం కోరింది. అలాగే, వాట్సాప్ వెబ్ వాడకం పూర్తవగానే తప్పనిసరిగా లాగౌట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ సూచనలను పాటిస్తూ మీ వ్యక్తిగత డేటా భద్రతను కాపాడుకోవాలని అధికారులు కోరారు.