Andhra Pradesh: ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటినుంచే సర్వీసులు..
ఏపీలో మరో కొత్త ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనికి ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. జులై లేదా ఆగస్టులో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఏపీ ప్రజలకు తీపిబురు. త్వరలో రాష్ట్రంలో మరో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణంతో పాటు సరుకు రవాణాలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే దాదాపు పనులన్నీ పూర్తవ్వగా… ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టులో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయనే వివరాలను తెలుసుకున్నారు. ఇక ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్న జీఎంఆర్ ప్రతినిధులతో కూడా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక విషయాలు వెల్లడించారు.
97 శాతం పనులు పూర్తి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 97 శాతం పూర్తయినట్లు బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. జులై 5,8 లేదా ఆగస్ట్ 17,19వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకించారు. ఎర్త్ రన్ వే పనులు 100 శాతం, ఎయిర్ ట్రాఫిక్ పనులు 95 శాతం పనులు పూర్తవ్వగా.. ఎయిర్‌పోర్ట్‌కి అనుసంధానం చేసే రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. త్వరలోనే రోడ్ల పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఏపీలో మరో ఆరు ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్ పోర్ట్ పనులను వేగవంతం చేసి పూర్తి చేశామని పేర్కొన్నారు.
కొత్త ఎయిర్ పోర్టులు
ఇక ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఉడాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నిధులు కూడా కేటాయించింది. పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఎయిర్ పోర్ట్ కూడా రానుంది. నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్ట్ వస్తే పల్నాడుతో పాటు పక్క జిల్లాలకు కనెక్టివిటీ పెరగనుంది. నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, కాకినాడ జిల్లా అన్నవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురంలో కొత్త ఎయిర్ పోర్ట్‌లను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. డీపీఆర్‌లను తయారుచేసే పనులకు శ్రీకారం చుట్టింది. ఏపీలో విమాన ప్రయాణాలకు మంచి డిమాండ్ ఉంది. అలాగే జిల్లాల మధ్య తిరిగే సర్వీసులకు కూడా ఆదరణ లభిస్తోంది. దీంతో అన్ని జిల్లాల్లో ఎయిర్ పోర్ట్‌లు నిర్మించడం వల్ల రాష్ట్ర నలుమూలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.
