2026లో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం లాభదాయకమేనా? ప్రముఖ సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 2026లో ఈ పెరుగుదల కొనసాగుతుందా? పెట్టుబడిదారులు ఇప్పుడు ఏం చేయాలి? బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం, 2026లో బంగారం ధర ఔన్సుకు 4,538 డాలర్లకి చేరుకుంటుందని అంచనా. ఆర్థిక నిపుణుల అంచనా ఏంటో చూద్దాం..

2025 అంటే చాలా మందికి బంగారం ధరలు గుర్తుకు రావొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా బంగారం ధరలు పెరిగాయి. ఆకాశమే హద్దుగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు వెండి కూడా తానేం తక్కువ కాదు అన్నట్లు దూసుకెళ్లింది. బంగారం, వెండి ధరల పెరుగుదల చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇలాగైతే వీటిని కొనడం కష్టమే అనుకున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, రెండో వైపు ఈ ధరల పెరుగుదల చూసి చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వెండిపై భారీగా పెట్టుబడి పెట్టారు. మరి ఈ ధరల పెరుగుదల ఈ కొత్త ఏడాది 2026లో కూడా కొనసాగుతుందా? లేదా? పెట్టుబడిదారులు బంగారం వెండిపై ఈ ఏడాది పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వెనిజులాపై దాడి, లాటిన్ అమెరికా దేశాలకు వార్నింగ్ వంటి వాటితో పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. సేఫ్ హెవెన్ గా భావించే బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) తాజా లోహాల పరిశోధనపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2026లో బంగారం పెట్టుబడిదారుల కోసం కీలకమైన హెడ్జ్, ప్రధాన రిటర్న్ సోర్స్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే వెండి మరింత పెరుగుదల సామర్థ్యంతో ముందంజలో ఉండవచ్చు. BofA మెటల్స్ రీసెర్చ్ హెడ్ మైఖేల్ విడ్మర్ అభిప్రాయం ప్రకారం.. Gold సగటు ధర 2026లో ఔన్సుకు 4,538 డాలర్లకి చేరుతుంది. బంగారం పెరుగుదలలో సరఫరా తగ్గడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, పెట్టుబడిదారుల బలమైన డిమాండ్ ఈ పెరుగుదలలో ప్రధాన కారణంగా ఉండనున్నాయి.
BofA అభిప్రాయం ప్రకారం.. 2026లో ఉత్తర అమెరికాలో గోల్డ్ మైనింగ్ నిర్వహిస్తున్న సంస్థలు నుంచి బంగారం ఉత్పత్తి 2 శాతం తగ్గనుంది, అలాగే ఖర్చులు (AISC) 3 శాతం పెరుగుతాయి. అందువల్ల బంగారం ధర ఔన్సుకు సుమారు 1,600 డాలర్ల వద్ద స్థిరంగా ఉంటుంది. పెట్టుబడిదారుల డిమాండ్ కేవలం 14 శాతం పెరిగినప్పటికీ, బంగారం 5 వేల డాలర్లకి చేరవచ్చు. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు కేవలం 0.5 శాతం బంగారం పెట్టుబడి మాత్రమే చేస్తున్నారు. కానీ సాధారణ మోడల్ ప్రకారం 30 శాతం అవసరం, కాబట్టి వృద్ధికి పెద్ద అవకాశం ఉంది. సో మొత్తంగా 2026లో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం లాభదాయమే అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
