Union Budget 2026: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు డేట్ ఫిక్స్.. ఈ సారి ఎప్పుడంటే..?
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలమ్మ సరికొత్త రికార్డ్ సృష్టించనున్నారు.

2026-27 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారనేది క్లారిటీ వచ్చేసింది. సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆదివారం వచ్చినా ఆ సెంటిమెంట్‌ను కొనసాగించాలని కేంద్రం ప్రభుత్వం భావించింది. మరి కొద్దిరోజులు మాత్రమే కేంద్ర బడ్జెట్‌కు సమయం ఉండటంతో ఈ సారి సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి మినహాయింపులు ఉంటాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
జనవరి 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతీసారి బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఆ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ సారి కూడా అదే పాటించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, జరిగిన అభివృద్ది, రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే పథకాల గురించి వివరిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. తర్వాతి రోజు ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం మొదలుపెడతారు.
వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్
ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్ వన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పాటు 30 రోజులకుపైగా జైలు జీవితం గడిపితే సీఎంలు, మత్రులను తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ఈ సారి బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. అలాగే పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పలు నూతన సంస్కరణలు ఉంటాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్ అనగానే ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు, శ్లాబుల మార్పు గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రాబోతుంది. దీంతో ఆదాయపు పన్ను పరంగా ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.
