మేడారం జాతర
మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది.
కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… మేడారం జాతర. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా చార్జ్ తీసుకోవడం… ఈ రెండు ప్రత్యేకతల ప్రభావం ఈసారి మహా జాతరపై స్పష్టంగా కనిపించబోతోంది. రూ.100 కోట్లగా పైగా ఖర్చయ్యే జన జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు మంజూరు చేసింది. జాతరకు 10 రోజుల ముందే ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సీతక్క డెడ్‌లైన్ విధించారు.
వీఐపీలు, ప్రజాప్రతినిధుల రాక నేపథ్యంలో జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి. భారీగా సీసీటీవీ కెమరాలు, డ్రోన్ కెమరాలతో అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.