Medaram Jatara: మేడారంలో పేలిపోతున్న మటన్, చికెన్ ధరలు.. వాయమ్మో చెట్టు నీడకు కూడా కిరాయినా.. నిలువునా దోపిడీ
మేడారం జాతర అట్టాహాసంగా ప్రారంభమైంది. భక్తులు లక్షలాదిగా తరలివస్తుండగా.. స్ధానిక వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ధరలను రెట్టింపు చేసి అమ్ముతున్నారు. చికెన్, మటన్ ధరలు అయితే మండిపోతున్నాయి. చెట్టు నీడకు కూడా కిరాయి వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర గ్రాండ్‌గా ప్రారంభమైంది. బుధవారం అసలు జాతర ప్రారంభమవ్వగా.. జనవరి 30 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరగనుంది. ప్రధాన జాతర ప్రారంభమవ్వడంతో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. దీంతో మేడారంలో కాలు పెట్టాలంటేనే స్థలం లేనంతగా ప్రజలతో కిక్కిరిసి పోయింది. లక్షల మంది తరలివచ్చి బెల్లంతో బంగారపు మెక్కులు చెల్లించుకుంటున్నారు. జనం రద్దీతో వ్యాపారులకు ఇక్కడ కాసుల పంట పండుతోంది. చికెన్, మటన్, మద్యం, కొబ్బరికాయ, బెల్లం, అద్దె గదుల ధరలు భారీగా పెంచేసి వ్యాపారులు అమ్ముతున్నారు. ఇక కూర్చోవడానికి చెట్టు కింద స్థలంకు కూడా డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
చికెన్, మటన్ ధరలు భారీగా పెంపు
మేడారంకు వచ్చే భక్తులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. మొక్కుల కోసం భక్తులు బెల్లంతో పాటు కోళ్లు, మేకలను సమర్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కోళ్లు, మేకలను తమ వెంట తెచ్చుకోవడం వీలుకాదు. దీంతో జాతరలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో వీటి ధరలను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. కిలో లైవ్ కోడి ధర బయట రూ.170 ఉండగా.. జాతరలో ఏకంగా రూ.350 ధరకు అమ్ముతున్నారు. ఇక కేజీ మటన్ రూ.1500కు విక్రయిస్తున్నారు. అలాగే బయట మేకపోతే లైవ్ కిలో రూ.420గా ఉండగా.. జాతరలో మాత్రం రూ.వెయ్యికి అమ్ముతూ భక్తుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇక బీర్, విస్కీ, బ్రాందీ ధరలపై రూ.100 పెంచి విక్రయిస్తున్నారు.
చెట్టు నీడకు రూ.వెయ్యి
ఇక బయట కేజీ నాటుకోడి ధర రూ.400 వరకు ఉండగా.. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో రూ.700కి అమ్ముతున్నారు. జాతర ఇప్పుడే ప్రారంభం కావడంతో ఈ మూడు రోజుల్లో ధరలను వ్యాపారులు మరింత పెంచే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ ఇళ్లు అద్దెలు కూడా పెరిగిపోయాయి. ఒక రోజుకు రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. కనీసం చెట్ల కింద నీడ కోసం కూడా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తురంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతర సమీపంలో తోటలు ఉన్నవారు చెట్లను భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఒక్కో చెట్టుకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి హాయిగా గడిపేందుకు కొంతమంది డబ్బులు చెల్లించి అద్దెకు తీసుకుంటున్నారు. చెట్టు నీడకు కూడా అద్దె వసూలు చేయడం జాతరలో విశేషంగా మారిందని చెప్పవచ్చు.
