Medaram Jatara: సమ్మక్క-సారక్క కంటే ముందే తప్పనిసరి దర్శనం.. గట్టమ్మ తల్లి ఎవరు?
Gattamma Goddess: మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా ములుగు మార్గంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, మేడారం గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ ఆలయం ‘గేట్ వే ఆఫ్ మేడారం’గా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయం గురించిన ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gateway Of Medaram: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం జాతర ప్రారంభమైంది. మేడారం జాతరలో కోట్లాది మంది భక్తులు సమ్మక్క-సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. లక్షలాదిగా భక్తులు ఇప్పటికే మేడారం చేరుకున్నారు. బెల్లం బంగారం సమర్పించి ఆ తల్లుల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అయితే, మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా ములుగు మార్గంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, మేడారం గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ ఆలయం ‘గేట్ వే ఆఫ్ మేడారం’గా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయం గురించిన ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గట్టమ్మ తల్లి ఎవరు?
ములుగు జిల్లాలో ఉన్న గట్టమ్మ తల్లి ఆలయానికి, సమ్మక్క–సారలమ్మ తల్లులంతే వైభవం ఉందని భక్తులు విశ్వసిస్తారు. మేడారం గిరిజన రాజ్యం కోసం జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా గట్టమ్మ తల్లి అసమాన ధైర్యంతో పోరాడి వీరవనితగా చరిత్రకెక్కిందని గిరిజనుల నమ్మకం.
గట్టమ్మ తల్లితో పాటు సురపల్లి సురక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క వంటి అంగరక్షకులు కూడా సమ్మక్క తల్లిని కాపాడుతూ అమరులయ్యారు. అందుకే శ్రీరామునికి ఆంజనేయుడు, శివునికి నంది ఉన్నట్టే వనదేవతలకు నమ్మిన బంటుగా గట్టమ్మ తల్లి సమ్మక్క–సారలమ్మలతో సమానంగా పూజలందుకుంటోంది.
గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
గట్టమ్మ తల్లి పూజలు గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. పెళ్లి, సంతానం, పంటలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కోరికల కోసం భక్తులు మొక్కులు చెల్లిస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసినవారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించడం ఆనవాయితీ.
కోరిన వారికి కొంగుబంగారంగా వరాలు ఇస్తుందని నమ్మకం ఉండటంతో మేడారం వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం సమ్మక్క–సారలమ్మ సన్నిధికి బయలుదేరుతున్నారు. దీంతో ములుగు గట్టమ్మ తల్లి ఆలయం మరో శక్తిపీఠంగా విరాజిల్లుతోంది.
