AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?

Jaggery as Gold: జనవరి 28, బుధవారం రోజున మేడారం జాతర ప్రారంభమై జనవరి 31 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ జాతరలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ బెల్లాన్ని “బంగారం”గా గిరిజన దేవతలకు భక్తులు సమర్పించుకుంటారు. బెల్లాన్ని బంగారం ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Medaram Jatara: మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా  అయ్యిందో తెలుసా..?
Bellam Gold
Rajashekher G
|

Updated on: Jan 28, 2026 | 10:28 AM

Share

Sammakka Saralamma Jatara: తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది భక్తులు మేడారం పుణ్యక్షేత్రానికి తరలివచ్చి, తల్లుల దర్శనంతో తమ జీవితాలను పునీతం చేసుకుంటారు. ఈ ఏడాది ఈరోజు అంటే జనవరి 28, బుధవారం రోజున మేడారం జాతర ప్రారంభమై జనవరి 31 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రతీరోజూ లక్షలాది మంది భక్తులు మేడారం సమ్కక్క-సారక్క గద్దెల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే, ఈ జాతరలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ బెల్లాన్ని “బంగారం”గా గిరిజన దేవతలకు భక్తులు సమర్పించుకుంటారు. బెల్లాన్ని బంగారం ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం అంటే బంగారం ఎందుకు?

సాధారణంగా బెల్లం అంటే తీపి పదార్థం. కానీ మేడారంలో మాత్రం అది ధనానికి ప్రతీక కాదు, భక్తికి ప్రతీక. తల్లి సారలమ్మకు భక్తులు సమర్పించే బెల్లాన్ని ఇక్కడ బంగారంతో సమానంగా భావిస్తారు. దీనికి ప్రధాన కారణం.. తల్లి సారలమ్మ భక్తి విలువను మాత్రమే చూస్తుంది, ధన విలువను కాదు అన్న విశ్వాసం.

గిరిజన సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం.

గిరిజనుల జీవన విధానం ప్రకృతి ఆధారితం. వారికి బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు అందుబాటులో ఉండేవి కాదు. కానీ తమ శ్రమతో తయారైన బెల్లం మాత్రం వారికి అమూల్యమైనది. అందుకే.. తమ శ్రమ ఫలాన్ని తల్లికి అర్పించడం.. నిజమైన బంగారం అర్పించినట్లే అనే భావన బలంగా నాటుకుపోయింది.

తల్లి సారలమ్మ కథలో బెల్లం ప్రాధాన్యం

పురాణగాథల ప్రకారం.. సమ్మక్క–సారలమ్మలు ధర్మం కోసం పోరాడిన వీర వనితలు. రాజ్యాధికారాన్ని, సంపదను ఆశించలేదు. ప్రజల కష్టాలు, వారి నిజమైన భక్తి మాత్రమే వారికి ముఖ్యం. అందుకే నగలు కాదు. నోట్లు కాదు, విలువైన వస్తువులు కాదు.. శుద్ధ మనసుతో సమర్పించిన బెల్లమే తల్లికి బంగారం అయింది.

“బంగారం” అని పిలవడం వెనుక ఉన్న లోతైన సందేశం

మేడారం జాతర మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్పుతుంది. భగవంతుడికి విలువైనది మన ఆస్తి కాదు, మన అర్పణలోని శ్రద్ధ. ఇక్కడ బెల్లాన్ని తూకం వేసి అమ్మడం కాదు, భక్తిని కొలవడం కూడా కాదు. కేవలం నమ్మకం, వినయం, కృతజ్ఞత మాత్రమే ముఖ్యం. అందుకే చాలా మంది భక్తులు తమ నిలవెత్తు బంగారం ఇచ్చుకుంటారు. సంతానం కలిగితే వారితో కలిసి తూకం వేసి బంగారాన్ని తల్లులకు సమర్పించుకుంటారు.

ఇంకా కొన్ని విశ్వాసాలుు.. ఆదివాసీలు ఒకప్పుడు బెల్లం చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు. అందుకే దీన్నే బంగారంగా వనదేవతలకు సమర్పిస్తుండేవారు. మరో కథను పరిశీలించినట్లయితే.. సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు. అతడి పేరులో పగిడి అంటే బంగారం అనే అర్థం ఉందని వారి నమ్మకం. అందుకే ఇక్కడ బెల్లానికి బంగారం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

ఆధునిక సమాజానికి మేడారం సందేశం

ఈరోజు మనం దేవుడిని కూడా లావాదేవీల కోణంలో చూస్తున్నాం. కానీ మేడారం మాత్రం ఇదే చెబుతోంది.. చిన్న అర్పణైనా సరే.. మనస్ఫూర్తిగా ఉంటే అదే మహా బంగారం. అందుకే మేడారంలో బెల్లం విలువ పెరుగుతుంది, బంగారం కాదు. మేడారం జాతర కేవలం ఒక ఉత్సవం కాదు. అది భక్తి తత్వశాస్త్రం. ఇక్కడ బెల్లం బంగారం అవుతుంది, పేదరికం పవిత్రత అవుతుంది, భక్తుడు రాజు అవుతాడు.