AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులు కనిపించేసరికి అందరూ పరారవుతున్నారు.. డెన్ లోపలికి వెళ్లి చూడగా..

శేషాచలం రిజర్వు ఫారెస్ట్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దళం కర్ణాటకలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో దాడులు చేపట్టి 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు స్వాధీనం చేసుకుని 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుబడిన ఈ ఆపరేషన్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది.

పోలీసులు కనిపించేసరికి అందరూ పరారవుతున్నారు.. డెన్ లోపలికి వెళ్లి చూడగా..
Red Sandalwood Smuggling
Raju M P R
| Edited By: |

Updated on: Mar 02, 2026 | 7:30 PM

Share

శేషాచలం రిజర్వు ఫారెస్ట్‌లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటైన ప్రత్యేక దళం మరోసారి భారీ విజయం సాధించింది. తిరుపతి జిల్లా ఎస్పీ, రెడ్ శాండిల్ హెడ్ సుబ్బారాయుడు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ కర్ణాటకలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకుంది. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం.02/2026 కేసులో పరారీలో ఉన్న ముద్దాయిల ఆచూకీ కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. విశ్వసనీయ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో దాడులు నిర్వహించారు. సిద్ధాపూర్ ప్రాంతంలోని హరత్నహళ్లి గ్రామం వద్ద కర్ణాటక పోలీసుల సహకారంతో ఎర్రచందనం గోడౌన్‌ను గుర్తించారు. అక్కడ అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన మూడు వాహనాలను గుర్తించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి అక్కడున్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వెంబడించడంతో 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా, వారి సమాచారంతో కోళ్లఫారం తరహా నిర్మాణంను తనిఖీ చేశారు. అక్కడ 195 ఎర్రచందనం దుంగలు, రీపర్లు, స్క్రాప్ మెటీరియల్‌తో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన దుంగలు, వాహనాల విలువ సుమారు రూ.5 కోట్ల మేర ఉంటుందని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. పరారీలో ఉన్న వారిలో కొందరు ప్రధాన స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇంత పెద్ద రాకెట్‌ను ఛేదించి భారీ ఎత్తున ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఎస్పీ అభినందించారు.  శేషాచలం అటవీ ప్రాంత సంపదను కాపాడేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయంతో చర్యలు తీసుకుంటున్న టాస్క్ ఫోర్స్ తాజా ఆపరేషన్… ఎర్రచందనం మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us