దారులన్నీ మేడారం వైపే.. నేటి నుంచే మహా జాతర.. ఇవాళ గద్దెలపైకి పగిడిద్దరాజు, సారలమ్మ..!
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరకు తెర లేచింది. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలు.. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర, కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుంది. ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతర నేడు జనవరి 28, బుధవారం నుంచి జనవరి 31 వరకు జరగనుంది.
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరకు తెర లేచింది. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలు.. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర, కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుంది. ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతర నేడు జనవరి 28, బుధవారం నుంచి జనవరి 31 వరకు జరగనుంది. నాలుగు రోజులపాటు సాగే జాతరకు.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. ఈ ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గద్దెల దగ్గర భారీ క్యూలైన్లు కనిపించాయి. భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు.
కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి సాయంత్రం మేడారం గద్దెల ప్రాంగణంలో పూజారులు ప్రతిష్ఠిస్తారు. వారికి రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్వాగతం పలకనున్నారు. ఇక రేపు గురువారం సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు లక్షల మంది భక్తులు జాతరకు తరలి వస్తున్నారు.
ఇక మేడారం మహాజాతర నిర్వహణలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా పోలీసులు, తొలిసారిగా AI టెక్నాలజీతో భద్రత కల్పిస్తున్నారు. AI టెక్నాలజీ కెమెరాలతో పాటు, గగనతలం నుంచి డ్రోన్ కెమెరాలు.. డేగ కళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మేడారంలో ఏర్పాటుచేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి, చుట్టూ 20 కిలో మీటర్ల మేర AI టెక్నాలజీతో నిఘా పెట్టారు. జాతర నిర్వహణలో పోలీస్ శాఖ కీలమైన పాత్ర పోషిస్తోంది. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం నుంచి వన ప్రవేశం చేసే వరకూ, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్ మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, VIP లు, VVIPల భద్రతను పూర్తిగా పోలీస్ శాఖ పర్యవేక్షిస్తుంది.
ఈసారి జాతరకు కోటి 50 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 13 వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 డ్రోన్ కెమెరాలు, 480 సీసీ కెమెరాలను, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో అన్ని దారులు మేడారం వైపునకే దారి తీస్తున్నాయి. నాలుగువేలకు పైగా ఆర్టీసీ బస్సులు, దాదాపు రెండు లక్షలకు పైగా ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్ల బండ్లు… ఇలా అన్ని మార్గాల్లో చలో మేడారం అంటున్నారు భక్తులు.
మేడారం మహా జాతరకు ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మొత్తం 5 రూట్ల ద్వారా భక్తుల రాకపోకలు సాగుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలు, పస్రా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే, వన్‌వేలో వెళ్లిపోవచ్చని ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ అన్నారు. తిరిగి వచ్చేటప్పుడు నార్లపూర్ నుంచి బయ్యక్కపేట మీదుగా ఎగ్జిట్ ఉంటుంది. ఇక ఆర్టీసీ బస్సులు, VIPలు, VVIPల వాహనాలు…పస్రా నుంచి స్ట్రెయిట్‌గా వెళ్లి తాడ్వాయి చేరుకుని, అక్కడ్నించి మేడారానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఇక వాళ్లకు తిరుగు ప్రయాణం కూడా సేమ్ రూట్‌లోనే ఉంటుందన్నారు.
ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
