సమ్మక్క సారక్క మీరే దిక్కు.. మేడారం హుండీ కానుకల్లో చిత్ర విచిత్రాలు.. ఆస్తి కోసం ఒకరు.. ప్రేమకోసం మరొకరు..
మేడారం జాతర ముగిసింది.. హుండీల లెక్కింపు కొనసాగుతుంది. కానుకల లెక్కింపు సందర్భంగా లభ్యమవుతున్న భక్తుల వింత కోరికల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కరెన్సీ కట్టలకు సమాంతరంగా వింత కోరికలు చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఇంతకి ఆ లేఖల్లో ఏముంది..! భక్తుల వింత కోరికలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..

మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది.. అయితే భక్తులు హుండీలో డబ్బుతో పాటు కొన్నిలేఖలు కూడా వేయడం, లెక్కించే సిబ్బందిని షాక్ అయ్యేలా చేసింది. జాతర హుండీల లెక్కింపులో కొన్ని ప్రేమలేఖలు రావడం, తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్న లేఖలు హుండీలో కనిపించాయి. అంతేకాదు ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని ఇలా రకరకాలుగా రాసి హుండీలలో వేశారు. హుండీలను లెక్కిస్తున్న సిబ్బందికి ఈ లేఖలు దర్శనమివ్వడం ఆసక్తికర చర్చకు కారణమైంది. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ మొత్తం పది రోజుల పాటు సాగనుంది.
మేడారం మహా జాతరలో ఏర్పాటుచేసిన 828 హుండీలను హన్మకొండలోని టిటిడి కళ్యాణ మండపానికి తరలించి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచారు.. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. 5వ తేదీ నుండి కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీల లెక్కింపు కొనసాగుతోంది.. సుమారు 500 మంది సిబ్బంది హుండీల లెక్కింపులో పాల్గొంటున్నారు.
వీడియో చూడండి..
అయితే హుండీ కౌంటింగ్ లో లభ్యమవుతున్న కానుకలతో పాటు భక్తుల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.. వింత వింత కోరికలు లేఖల రూపంలో రాసి సమ్మక్క సారక్క దేవతలకు మొరపెట్టుకొని హుండీలలో వేశారు.
ఓ భక్తుడు తన కొడుకు బారి నుండి కాపాడు తల్లిని వేడుకుంటూ 100 రూపాయల నోటు పై తన కోరిక రాసి సమ్మక్క తల్లి హుండీలో వేశాడు.. మరో భక్తుడు తన తల్లిదండ్రుల ఆస్తి శివరాత్రి లోపే తనకు దక్కేలా చూడాలని కోరుకుంటూ లేఖ రాసి సమ్మక్క తల్లి హుండీలో వేశాడు.
మరో ప్రేమ జంట వాళ్ళ ఇరు కుటుంబాలు కలిసి వారిని ఆహ్వానించాలని, ఇరు కుటుంబాలు కలిసి శుభకార్యాలు నిర్వహించాలని కోరుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు లేఖ రాసి అందులో వేశారు.. మరో భక్తుడు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యేలా దీవించుతల్లి అని వేడుకుంటూ లేఖలు రాశాడు.
వింత వింత కోరికలతో భక్తులు సమ్మక్క సారక్క దేవతల హుండీలో వేసిన లేఖలు కౌంటింగ్ లో కలకలం రేపుతున్నాయి.. సిబ్బంది కడుపుబ్బ నవ్వుకుంటూ కాస్త రిలాక్స్ అవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
