Kashmir Tourism: కాశ్మీర్ లోయలో కనువిందు చేస్తున్న అందాలు.. రికార్డు స్థాయిలో పర్యాటకుల తాకిడి!
భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ మళ్లీ పర్యాటకులతో కళకళలాడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన విషాదకర ఉగ్రదాడి తర్వాత ఒడిదుడుకులకు లోనైన పర్యాటక రంగం.. ఇప్పుడు శీతాకాలం రాకతో సరికొత్త ఊపిరి పోసుకుంటోంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, గడ్డకట్టిన సరస్సులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంటే.. కాశ్మీరీల మొహాల్లో మళ్లీ చిరునవ్వులు విరుస్తున్నాయి.

2024లో రికార్డు స్థాయిలో దాదాపు 30 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్ లోయను సందర్శించి సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే, ఏప్రిల్ 2025లో జరిగిన ఉగ్రదాడి పర్యాటకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. దీంతో బుకింగ్స్ భారీగా రద్దయ్యాయి. కానీ, ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, స్థానికుల ఆత్మీయ ఆతిథ్యం పర్యాటకుల్లో మళ్లీ నమ్మకాన్ని నింపాయి. ప్రస్తుతం గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాల్లో హోటళ్లు 80 శాతం నుంచి 90శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
డిసెంబర్, జనవరి నెలల్లో కాశ్మీర్ అందం వర్ణనాతీతం. గుల్ మార్గ్ లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్కీ రిసార్ట్ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. గడ్డకట్టిన దాల్ సరస్సుపై షికారా ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇస్తోంది. కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలకు ఈ రద్దీ పెద్ద ఊరటనిస్తోంది. షికారా వాలాలు, హస్తకళల వ్యాపారులు, ట్యాక్సీ డ్రైవర్లు మళ్లీ బిజీ అయ్యారు.
పర్యాటక రంగాన్ని కాపాడేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. విమానాశ్రయాల్లో మెరుగైన విజిబిలిటీ పరికరాలు, మంచు తొలగింపు యంత్రాలు, పర్యాటక ప్రదేశాల వద్ద అదనపు సెక్యూరిటీ బలగాలను మోహరించారు. సోషల్ మీడియా ద్వారా కాశ్మీర్ సురక్షితమని పర్యాటకులు షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
అందమైన లోయ మళ్లీ మాకు స్వాగతం చెబుతోంది.. ఇక్కడ భయం లేదు, కేవలం మంచు అందాలే ఉన్నాయి అంటూ పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై పర్యాటకం పైచేయి సాధిస్తోందని చెప్పడానికి ఈ వింటర్ సీజనే నిదర్శనం. ప్రకృతి అందాల మధ్య కాశ్మీర్ లోయ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
