IPL 2026 : ఆర్‌సీబీ ఆల్ టైమ్ టీమ్‌ను ప్రకటించిన దినేష్ కార్తీక్.. కోహ్లీకి షాక్, కెప్టెన్‌గా పాటిదార్
Royal Challengers Bangalore : ఆర్‌సీబీ ఆల్-టైమ్ 11 టీమ్‌ను దినేష్ కార్తీక్ ప్రకటించారు. విరాట్ కోహ్లీని కాదని, 2025లో జట్టుకు కప్పు అందించిన రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దినేష్ కార్తీక్ తన టీమ్ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ సందడి మొదలవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆర్‌సీబీ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ఆల్-టైమ్ ఆర్‌సీబీ 11 జట్టును డీకే ప్రకటించారు. అయితే ఈ జట్టులో కార్తీక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా కోహ్లీ వంటి దిగ్గజం ఉండగా, రజత్ పాటిదార్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దినేష్ కార్తీక్ తన టీమ్ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ చారిత్రాత్మక విజయంలో కెప్టెన్‌గా రజత్ పాటిదార్ పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కార్తీక్ కొనియాడారు. “విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్లు జట్టును నడిపించి విజయవంతమయ్యారు. కానీ రజత్ పాటిదార్ జట్టుకు కప్పు అందించిన కెప్టెన్. బ్యాటర్‌గా కూడా అతి తక్కువ కాలంలో అతను చూపిన ఇంపాక్ట్ అసాధారణం” అని కార్తీక్ వివరించారు.
బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా డీకే ప్రయోగాలు చేశారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఫాఫ్ డుప్లెసిస్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్న కార్తీక్.. ఐపీఎల్ కింగ్ విరాట్ కోహ్లీని మూడో స్థానానికి పరిమితం చేశారు. నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్, ఐదో స్థానంలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ నిలిచారు. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ఎంచుకోవడం గమనార్హం. ఇక ఆల్‌రౌండర్ కోటాలో కృనాల్ పాండ్యాకు చోటు దక్కింది. 2025 ఫైనల్‌లో కృనాల్ చేసిన మ్యాజిక్ స్పెల్, సీఎస్‌కేపై అతను ఆడిన ఇన్నింగ్స్ వల్లే ఆర్‌సీబీ దగ్గర ఇప్పుడు ట్రోఫీ ఉందని కార్తీక్ గుర్తు చేశారు.
బౌలింగ్ విభాగంలో పాత కొత్త కలయిక కనిపిస్తోంది. ఆర్‌సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన యుజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్‌లకు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌లకు అప్పగించారు. 2025 సీజన్ విజయంలో హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించినందున అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు డీకే తెలిపారు. ఈ ప్లేయింగ్ ఎలెవన్ చూస్తుంటే కార్తీక్ కేవలం గణంకాలకే కాకుండా, జట్టుకు ట్రోఫీ అందించిన విన్నర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
దినేష్ కార్తీక్ ఆల్-టైమ్ ఆర్‌సీబీ 11 : క్రిస్ గేల్, ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్, జోష్ హేజిల్‌వుడ్,
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
