Andhra Pradesh: పబ్జీలో పరిచయం.. ఆ కాల్స్ చేయాలంటూ మహిళకు వేధింపులు.. సీపీ ఎంట్రీతో సీన్ రివర్స్
పబ్‌జీ గేమ్ ఆడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ గేమ్‌లో పరిచయమైన ఓ మహిళతో చాటింగ్స్ చేస్తూ.. నెమ్మదిగా పర్సనల్ డేటా లాగేసి, ఆపై న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ నరకం చూపించాడు హైదరాబాద్‌కు చెందిన ఒక కిలాడీ. చివరికి వైజాగ్ సీపీ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయిందో.. తెలుసుకుందాం.

మీరు ఆన్‌లైన్ గేమ్‌లు ఎక్కువగా ఆడుతున్నారా..? గేమ్స్‌లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఆన్‌లైన్ ఆటల్లో కాస్త గీత దాటి ముందుకు వెళ్తే జీవితాలు నట్టేట మునుగుతాయని నిరూపించే మరో షాకింగ్ ఘటన వైజాగ్‌లో వెలుగుచూసింది. పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన ఓ మహిళ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఆమె ఎమోషన్స్‌తో ఆటలాడుకుంటూ నగ్నంగా వీడియో కాల్స్ చేయాలంటూ టార్చర్ పెట్టిన ఓ సైబర్ నేరగాడి ఆట కట్టించారు విశాఖ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో గేమ్ ఆడుతూ హైదరాబాద్‌కు చెందిన నరేన్ వేణుగోపాల్ పసుపులేటి అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గేమ్ పరిచయాన్ని కాస్తా సోషల్ మీడియా అకౌంట్ల వరకు తీసుకెళ్లాడు వేణుగోపాల్. రోజురోజుకూ చాటింగ్ చేస్తూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. మాటల నమ్మకంతో ఆ మహిళ తన వ్యక్తిగత విషయాలు, పర్సనల్ డేటాను కూడా అతనితో షేర్ చేసుకుంది. ఆమె నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నాకే వేణుగోపాల్ తన అసలు రంగు బయటపెట్టాడు.
న్యూడ్ కాల్స్ చేయాలంటూ బ్లాక్ మెయిల్
మహిళకు తనపై పూర్తిగా నమ్మకం కుదిరిందని గ్రహించిన వేణుగోపాల్.. ఆమెను మానసికంగా లొంగదీసుకునేందుకు వక్రబుద్ధితో వికృత ప్లాన్ వేశాడు. మొదట ఆమెను న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ వేధించడం ప్రారంభించాడు. అందుకు ఆ మహిళ తీవ్రంగా నిరాకరించింది. ఆమె ఒప్పుకోకపోవడంతో నిందితుడు వెనక్కి తగ్గకుండా మరింత టార్చర్ పెట్టాడు. “నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే.. నీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా.. నీ బంధువులందరికీ పంపిస్తా” అంటూ దారుణమైన బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు.
డిప్రెషన్‌లోకి మహిళ.. రంగంలోకి దిగిన సీపీ..
నిందితుడి వేధింపులు, టార్చర్ భరించలేక ఆ మహిళ తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి చేరుకుంది. అయితే చివరి నిమిషంలో ఆమె వెల్ విషర్స్ ఇచ్చిన ధైర్యంతో.. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళ పరిస్థితిని చూసి తక్షణమే స్పందించిన సీపీ.. కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాల సహాయంతో కూపీ లాగింది. నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి వేణుగోపాల్ పసుపులేటిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన వైజాగ్ పోలీసులు.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో తెలియని వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్ చేయవద్దని, ముఖ్యంగా మహిళలు తమ వ్యక్తిగత ఫోటోలు, సోషల్ మీడియా అకౌంట్స్ షేర్ చేసి సైబర్ ముఠాల బారిన పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
