AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Arvind: బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి అసలు కారణం ఇదే.. TV9 క్రాస్‌ఫైర్‌లో ఎంపీ అర్వింద్ కీలక కామెంట్స్..

MP Arvind: బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి అసలు కారణం ఇదే.. TV9 క్రాస్‌ఫైర్‌లో ఎంపీ అర్వింద్ కీలక కామెంట్స్..

Krishna S
|

Updated on: May 23, 2026 | 9:12 PM

Share

తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? గెలిచే సత్తా ఉన్నా పార్టీ ఎందుకు వెనుకబడుతోంది? అనే ప్రశ్నలకు టీవీ9 తెలుగు క్రాస్ ఫైర్‌లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ ధర్మపురి అరవింద్ కీలక విషయాలు వెల్లడించారు. బీజేపీకి ఇప్పుడు కావలసింది మోడీ బ్రాండ్‌ను ఓట్లుగా మార్చగల సత్తా ఉన్న నాయకులని అన్నారు. అంతేకాకుండా పార్టీ అంతర్గత కుమ్ములాటలపై ఆసక్తికర విషయాలు చెప్పారు.

తెలంగాణ బీజేపీ అంతర్గత పరిణామాలు, భవిష్యత్తు సవాళ్లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 తెలుగు క్రాస్ ఫైర్‌లో రాష్ట్రంలో బీజేపీ ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలను బాహాటంగానే అంగీకరించారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్న వాదనలను తోసిపుచ్చుతూనే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి అభ్యర్థులు కావాలో అరవింద్ తనదైన శైలిలో విశ్లేషించారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధించడం చాలా సులభమని అరవింద్ అభిప్రాయపడ్డారు. ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ఆ నమ్మకాన్ని ఓట్లుగా మార్చగల బలమైన క్యాండిడేట్లు పార్టీకి కరువయ్యారని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మోదీ పాలనను, పార్టీ విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగల ఒక మంచి లీడర్ కావాలని అరవింద్ అన్నారు. కేవలం రెండు ఉమ్మడి జిల్లాల నుంచే ఏడుగురు ఎంపీలు గెలవడానికి కారణం.. అక్కడ తాము మోదీ పాలనను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లామని ఆయన స్పష్టం చేశారు.

లోపం ఢిల్లీది కాదు.. ఇక్కడిదే

రాష్ట్రంలో బీజేపీ అధికారానికి దూరం కావడానికి జాతీయ నాయకత్వం కారణం కాదని, స్థానిక వైఫల్యాలేనని అరవింద్ కుండబద్దలు కొట్టారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను సరిగ్గా ఎండగట్టడంలో, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడంలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతోందని ఆయన అంగీకరించారు. గ్రౌండ్ లెవెల్‌లో అంటే బూత్ స్థాయి నుండి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో లోపాలు ఉన్నాయన్నారు. ఈ స్థానిక సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ల వంటి సీనియర్ లీడర్లపైనే ఉందని సూచించారు. మహేష్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, లక్ష్మణ్ వంటి ముఖ్య నేతల మధ్య అంతర్గత కుమ్ములాటల వల్లే బీజేపీ దెబ్బతింటోందనే వాదనను అరవింద్ పూర్తిగా కొట్టిపారేశారు. రాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు చాలా సహజమని, ఇది తెలంగాణ బీజేపీకి మాత్రమే పరిమితం కాదని చెప్పుకొచ్చారు.

Published on: May 23, 2026 09:07 PM
Follow Us