ప్రతి సీన్ క్లైమాక్స్ ఫైట్‌లా వాటర్ పాలిటిక్స్! పుష్కరకాలంగా అదే ఎమోషన్!
ధవళేశ్వరం కన్నీరు కారుస్తోంది.. కనిపించడం లేదా రైతుల అవస్థలు, అన్నదాతల ఆత్మహత్యలు అని. ప్రకాశం బ్యారేజీ బోరుమంటోంది.. నెర్రలిచ్చిన నేలపై సాగిలపడి, నింగికేసి చూస్తున్న కర్షకుడు గుర్తొచ్చి. పొలాలు, గొంతులు తడపాల్సిన బంగారం లాంటి నీళ్లని.. తనే దోసిట పట్టి కడలిలో పారబోస్తుంటే తట్టుకోలేక గుక్కపెడుతున్నాయి ప్రాజెక్టులు. ఒక్కో క్యూసెక్కు తన గేటు దాటి పోతుంటే.. అయ్యో రైతుకు అందకుండా పోతున్నాయే అని గొంతుచించుకుంటున్నాయి నోళ్లు లేని ఆ బ్యారేజీలు. నిజమే కదా. ఏటా ఆగస్ట్‌లో ఒకటే బ్రేకింగ్. 'లక్షల క్యూసెక్యుల వరద నీళ్లు సముద్రం పాలు' అని. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాసి మరీ రెడీగా ఉంటారు అధికారులు.. కాస్త ఎక్కువ వరద రాగానే సంద్రంలోకి వదలడానికి. చివరికి ఎవరి పాలు చేస్తున్నారు వందల టీఎంసీల నీళ్లని? ఒక్క నీటి చుక్క కూడా అటుఇటు కావొద్దట. ఒక్క బొట్టు కూడా ఎవరికీ ఎక్కువ పోవడానికి వీల్లేదట. కుదురుతుందా అలా? ఎన్నాళ్లీ పంతం ఇలా? రెండు నదుల నీళ్లు కొలిచి 'మీకింత మాకింత' అని పంచుకోడానికి... రెండు ట్రైబ్యునళ్లు, సరిపోవన్నట్టు వాటర్ బోర్డులు, అదీ చాలక ఇప్పుడు కమిటీలు. ఏంటిదంతా? పుష్కరకాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం, పైనుంచి కేంద్రం జోక్యం. అయినా తెగడం లేదీ పంచాయితీ. అన్నట్టు 2013 నాటి మాట ఒకటి గుర్తొస్తోంది. కృష్ణా నీటి లడాయి ఎన్నటికీ తెగదు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్‌లో చెప్పారు. అదే మాట నిజమవుతోందిగా ఇప్పుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ప్రతిపాదించిన ప్రాజెక్ట్.. 'పాలమూరు-రంగారెడ్డి'. పదేళ్లైనా పూర్తికాక.. మీరంటే మీరంటూ వాదులాడుకుంటున్నాయి పార్టీలు. మధ్యలో ఏపీని జోడిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంతు. ఆపానని తెలంగాణ సీఎం. మీరు ఆపమంటే ఆగింది కాదని ఏపీ సీఎం. ఇంకెన్నాళ్లు సాగుతుందో ఈ ఫైట్. రెండు పార్టీలు, రెండు రాష్ట్రాలు తగువులాడుకుంటే.. ఒక్కటిగా ఉన్న తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడం కాదా అది? ఈ జల జగడం నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమా? రాజకీయాల కోసమా? తగ్గాల్సింది ఎవరు, నెగ్గాల్సింది ఎవరు, మధ్యలో ఉండి తేల్చాల్సింది ఎవరు?

ఈ దేశంలో నీళ్లు భగ్గుమని మండింది కావేరీ జలాల విషయంలోనే. తమిళనాడు-కర్నాటక మధ్య ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంటుందా ఇష్యూ. దాన్ని తలదన్నేలా తెలుగు రాష్ట్రాలు పోట్లాడుకుంటున్నాయి. విభజనకు ముందు మొదలైన గొడవ ఇదంతా. పరిష్కరించేందుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేసినా.. తేలలేదు. విభజనయ్యాక.. కృష్ణా, గోదావరి బోర్డులు వేశారు. పరిష్కారం కాలేదు. సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. మధ్యలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఇంకా కొలిక్కి రాలేదు. ఇంతకీ.. ఈ గొడవ ఎక్కడ మొదలైంది? ఇప్పుడెందుకొచ్చింది? వాటర్ ఒక ఎమోషన్. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి మొదటి కారణం.. నీళ్లు. ఈ దేశంలో రాష్ట్రాల మధ్య తగువు పెట్టింది కూడా ఈ నీళ్లే. అందుకే, రాష్ట్ర విభజన సమయంలో ఎక్కువ చర్చ జరిగింది కూడా ఈ నీటి గురించే. రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటిని ఎలా వాడుకుంటారు, ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న నీటిని లక్షల ఎకరాలకు ఎలా పంపిణీ చేస్తారని ఆనాడే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నీటి అంశం.. రెండు రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయితీని సృష్టిస్తుందని కూడా ఆనాడే చెప్పుకొచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. అచ్చంగా ఇవాళ అదే జరుగుతోంది కూడా. ఒకానొక సమయంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు సమసిపోయినట్టే కనిపించాయి. రెండు రాష్ట్రాలు సమన్వయంతో, ఒక సహకారంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు చెబుతూ...
