Bengal Assembly Polls: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?

Rajesh Sharma

Rajesh Sharma |

Updated on: Feb 25, 2021 | 1:55 PM

ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల్లో విజయానికి కులాలు, మతాల ప్రాతిపదికన లెక్కలేసుకోవడం పార్టీలకు రివాజు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఎన్నికల విశ్లేషణలు తెరమీదికి వస్తున్నాయి. ఇందులో అత్యంత కీలకం కాబోతున్న..

Bengal Assembly Polls: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?

Muslim voters crucial in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మరో నాలుగైదు రోజుల్లో మోగబోతోంది. ఎన్నికల కమిషన్ సన్నాహాలు చూస్తుంటే వీలైనంత త్వరగా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును ప్రకటించే సంకేతాలు కనిపిస్తున్నాయి. షెడ్యూలు ప్రకటన విడుదలయ్యే సంకేతాలు కనిపించడంతో రాజకీయ పార్టీలు సైతం తమ సన్నాహాలను వేగవంతం చేశాయి. అధికారంలో వున్న పార్టీలు ప్రజలకు తాయిలాలను ప్రకటించడంలో వేగం పెంచాయి. ఇందులో భాగంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బెంగాల్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తానంటూ దానికి కేంద్ర సాయాన్ని అర్థించారు. అయితే.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల్లో విజయానికి కులాలు, మతాల ప్రాతిపదికన లెక్కలేసుకోవడం పార్టీలకు రివాజు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఎన్నికల విశ్లేషణలు తెరమీదికి వస్తున్నాయి.

దేశంలో ముస్లింల జనాభా అధికంగా వున్న రాష్ట్రాలలో బెంగాల్ ఒకటి. బెంగాల్ రాజకీయాల్లో గెలుపోటములను నిర్ణయించేది ముస్లింలే అంటే అతిశయోక్తి కాదు. మొత్తం జనాభాలో 20 శాతానికి మించి ముస్లింలున్న జిల్లాలు బెంగాల్ రాష్ట్రంలో తొమ్మిది వున్నాయి. నాడియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, బీర్‌బమ్, బర్దమాన్ జిల్లాల్లో ముస్లింల జనాభా మొత్తం జనాభాలో 20 శాతం కంటే ఎక్కువగా వుంది. ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకునే హైదరాబాద్ కేంద్రంగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు నడిపిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బెంగాల్ రాష్ట్రంపై కన్నేసింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రెండు నెలల క్రితమే ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆయన తరచూ బెంగాల్ రాష్ట్ర  పర్యటనకు వెళుతున్నారు. ముస్లింల జనాభా అధికంగా వున్న పట్టణాలలో బెంగాల్‌లోని అసన్‌సోల్ ఒకటి. అసన్‌సోల్ జిల్లాపై అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బెంగాల్ పోల్స్‌లో ఎంఐఎం ఎంట్రీతో ఎవరికి నష్టం అన్న అంఛనాలు అపుడే ఊపందుకున్నాయి.

సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్ మహానగరానికే పరిమితమైన ఎంఐఎం పార్టీ ముందుగా మహారాష్ట్రలోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఔరంగాబాద్ ప్రాంతంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసి చెప్పుకోదగిన సీట్లు సాధించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోను బరిలోకి దిగింది. ముంబయి మహానగరంలోను ఎంఐఎం పోటీచేసి గెలిచింది. ఆ తర్వాత యూపీవైపు దృష్టి సారించింది. తాజాగా గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి సత్తా చాటింది. అదే ఊపులో మొన్నటికి మొన్న జరిగిన గుజరాత్ మునిసిపల్ ఎన్నికల్లోను అడుగు పెట్టింది. సూరత్ మునిసిపల్ కార్పోకేషన్‌లో గణనీయంగా వార్డులను గెలుచుకుంది. అదే ఊపు బెంగాల్, తమిళనాడులోను కొనసాగించాలని ఓవైసీ భావిస్తున్నారు.

అయితే.. ఎంఐఎం పోటీ ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ తాజాగా ఊపందుకుంది. బెంగాల్ అసెంబ్లీ బరిలో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే అక్కడి ముస్లింల ఓట్లలో చీలిక రావచ్చని, అది ముస్లింలను ఓటుబ్యాంకుగా భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించవచ్చని పలువురు అంఛనా వేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర, యూపీ, బీహార్‌లలో అదే జరిగిందని అంటున్నారు. ఎంఐఎం ఎంతగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే అంతలా ముస్లింల ఓట్లు చీలి.. పరోక్షంగా బీజేపీకి బెనిఫిట్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. అందులో ముస్లింల జనాభా 20 శాతం కంటే మించిన తొమ్మిది జిల్లాల పరిధిలో ఏకంగా 25 లోక్ సభ స్థానాలున్నాయి. 25 లోక్ సభ స్థానాల పరిధిలో దాదాపు 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ 25 పార్లమెంటు సీట్లలో టీఎంసీ ఏకంగా 19 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. క్రిష్ణానగర్, డమ్ డమ్, బారాసాత్, బసీర్ హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్ పూర్, కోల్ కతా దక్షిణ్, కోల్ కతా ఉత్తర్, హౌరా, ఉలుబేరియా, సెరామ్ పూర్, అరామ్ బాగ్, టామ్ లుక్, కాంతి, బర్ధమాన్ పూరబ్, బోల్ పూర్, బీర్ బమ్ నియోజకవర్గాలను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది.

ఈ తొమ్మిది జిల్లాల్లో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య 178 కాగా.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలిచిన స్థానాల సంఖ్య 152. మొత్తం 294 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ముస్లిం జనాభా 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలు 125. నార్త్ 24 పరగణాస్, సౌత్ 24 పరగణాస్, బీర్ బమ్, బర్దవాన్ జిల్లాల్లో ఉన్న స్థానాలు 75 నుంచి 80 కాగా.. ముస్లింల జనాభా 20 శాతాన్ని మించిన 125 సీట్లలో గత ఆసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 81 స్థానాలు గెలుచుకుంది. మరో 14 సీట్లలో రెండో స్థానంలో నిలిచింది టీఎంసీ. లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి 40 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం నాలుగు స్థానాలలో విజయం సాధించింది.

అయితే, ఇపుడు ఎంఐఎం ఎంట్రీతో ఈ పరిస్థితి తలకిందులయ్యే అవకాశాలున్నాయి. ముస్లింల ఓట్లు ఎంఐఎం, టీఎంసీ మధ్య చీలితే  హిందువుల ఓట్లను పోలరైజ్ చేసుకుంటున్న బీజేపీకి లాభించే అవకాశాలుంటాయి. మరోవైపు రాష్ట్రంలో ముస్లిం వర్గాలకు కీలక నేత అబ్బాస్ సిద్దిఖీ కూడా ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఆయనకు రాష్ట్రంలో ఏకంగా 3 వేల మసీదులపై నియంత్రణ వుందని చెప్పుకుంటారు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌ను స్థాపించిన అబ్బాస్ సిద్ధిఖీ.. కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో భాగస్వాములయ్యారు. ఇక్కడే ఆయన ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ.. ఎంఐఎంపై నేరుగా తలపడబోనని సిద్ధిఖీ ఫిబ్రవరి 23న ప్రకటించారు. ఎంఐఎంతో నేరుగా పొత్తు పెట్టుకోనప్పటికీ.. ఆ పార్టీ బరిలోకి దిగే అసెంబ్లీ సీట్లలో తమ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పోటీచేయబోదని ఆయన వెల్లడించారు.

ఈ క్రమంలో బెంగాల్‌లో ఈసారి ఎంఐఎం ఎంట్రీ అసెంబ్లీ ఎన్నికలను ఆసక్తికరంగా మారుస్తోంది. ఎంఐఎం ఎంట్రీతో అందరికంటే ఎక్కువగా మమతాబెనర్జీ వర్రీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ముస్లింలను ప్రసన్నం చేసుకుంటూ ఎన్నో పథకాలను ప్రకటిస్తూ వస్తున్న దీదీ.. బెంగాల్ ముస్లింలను బాగు చేసేందుకు ఎక్కడ్నించో ఎవరో రానక్కర లేదని చెబుతున్నారు. ఇది పరోక్షంగా ఎంఐఎం అధినేత ఓవైసీని ఉద్దేశించిందేనన్నది జగమెరిగిన సత్యం. ముస్లింల ఓట్లు అధికంగా వున్నప్పటికీ.. వారి ఓట్ల కోసం ఓవైపు అధికార తృణమూల్, ఇంకోవైపు కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్, మరోవైపు ఎంఐఎం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఓట్ల చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. అది పరోక్షంగా బీజేపీ లాభించే అంశంగా పరిశీలకులు, విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.

ALSO READ: రెండేళ్ళ ముందే కసరత్తు షురూ.. దీదీకి ధీటుగా కమలం వ్యూహం

ALSO READ: బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు

ALSO READ: డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బైడెన్.. ‘ఆ‘ విధానం మరింత తీవ్రం.. భారత్‌కు లాభమా? నష్టమా?

ALSO READ: తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు.. న్యూ వెరైటీ N440K ఎఫెక్ట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu