Bengal Poll Plan: రెండేళ్ళ ముందే కసరత్తు షురూ.. దీదీకి ధీటుగా కమలం వ్యూహం.. అమీతుమీకి ఇక రెండు నెలలే గడువు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం ఉత్కంఠతో చూస్తోంది. అదే స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార టీఎంసీతో అమీతుమీకి సిద్దమైన బీజేపీ వ్యూహాత్మకంగా…

Bengal Poll Plan: రెండేళ్ళ ముందే కసరత్తు షురూ.. దీదీకి ధీటుగా కమలం వ్యూహం.. అమీతుమీకి ఇక రెండు నెలలే గడువు
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 24, 2021 | 8:20 PM

BJP, TMC tug of war in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం ఉత్కంఠతో చూస్తోంది. అదే స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార టీఎంసీతో అమీతుమీకి సిద్దమైన బీజేపీ వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. పలువురు కీలక నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నా.. సడలని ధైర్యంతో, తరగని విశ్వాసంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. బెంగాల్‌పై కన్నేసిన బీజేపీ.. ప్రత్యేక కార్యాచరణను ఎప్పట్నించి మొదలు పెట్టింది? దానికి ప్రతిగా వ్యూహాలకు దీదీ ఎప్పట్నించి పదును పెట్టారు? ఈ అంశాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరేసేందుకు ఎన్డీయే సారథి బీజేపీ రెండేళ్ళ క్రితమే అంటే 2019లోనే ప్రణాళిక రచించింది. బీజేపీ ఎత్తుగడలను ముందే పసిగట్టిన దీదీ ప్రతివ్యూహానికి చేదుడుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను ఆశ్రయించారు. ఇదంతా 2019 పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే మొదలైంది. 2019 జూన్ 4వ తేదీన అంటే జాతీయ స్థాయిలో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టిన సరిగ్గా 20 రోజులకు మమతాబెనర్జీ రాజకీయ వ్యూహంపై మంతనాలు మొదలు పెట్టారు. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్‌తో అగ్రిమెంటు కూడా చేసుకున్నారు.

ఆ తర్వాత ముందుగా ప్రభుత్వ పథకాలను మరింత ప్రజాకర్షకంగా మార్చడం ప్రారంభించారు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. అదే సమయంలో చిన్నా చితకా పార్టీలకు గాలమేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా బెంగాల్‌లో అప్పుడప్పుడే వేళ్ళూనుకుంటున్న ఎంఐఎం పార్టీని ఆదిలోనే అణచివేయాలన్న వ్యూహంతో ఆ పార్టీకి చెందిన అన్వర్ పాషాతోపాటు ఆయన సహచరులకు తమ పార్టీలోకి లాగారు. వారంతా మొన్నటి నవంబర్‌లో టీఎంసీలో చేరారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం చూపిన నేపథ్యంలో ముస్లిం ఓట్లు అధికంగా వున్న బెంగాల్లోను ఆ పార్టీ ప్రవేశిస్తే ముస్లింల ఓట్లు చీలి అది పరోక్షంగా బీజేపీ లాభించే అంశమని దీదీ భావిస్తున్నారు. అందుకే ఎంఐఎం పార్టీ బెంగాల్లో వేళ్ళూనుకోకుండా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం.

ఒకవైపు దీదీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించే తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా బీజేపీ కూడా వలసలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2020 డిసెంబర్ 19వ తేదీన తృణమూల్‌కు చెందిన కీలక నేత సువేందు అధికారి, ఎంపీ సునీల్ మండల్ సహా అయిదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఎమ్మెల్యేలు బనశ్రీ మెయిటీ, సిల్బ్ ద్రడ దత్తా, బిశ్వజిత్ కుందు, సుక్రా ముండా, సైకట్ పంజా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. వీరిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పార్టీలోకి తీసుకోవడం విశేషం. 2016లో సీపీఎం తరపున గెలిచిన ఎమ్మెల్యే దిపాలి బిస్వాస్ 2018లో టీఎంసీలో చేరి తాజాగా బీజేపీలోకి జంపయ్యారు. సీపీఎం ఎమ్మెల్యేలు తపసి మండల్, అశోక్ దిండా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎంపీ బీజేపీలో చేరిన వారిలో వున్నారు.

కొత్త సంవత్సరం 2021 ప్రారంభంలోనే టీఎంసీకి వరుస షాకులివ్వడం ప్రారంభించింది బీజేపీ. జనవరి ఆరున బెంగాల్ క్రీడల శాఖా మంత్రి లక్ష్మీరతన్ శుక్లాను, 14వ తేదీన ఎమ్మెల్యే జితేంద్ర తివారి (అసన్ సోల్) బీజేపీలో చేరారు. మరో టీఎంసీ సీనియర్ నేత అరిందమ్ భట్టాచార్య జనవరి 20వ తేదీన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జనవరి 29వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసిన మరో టీఎంసీ నేత రాజీవ్ బెనర్జీ బీజేపీలో చేరారు. ఎంపీ దినేశ్ త్రివేది కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మమత బ్యాచ్‌ని వీక్ చేయడంతోపాటు బెంగాల్‌లో ప్రజాదరణ వున్న సినీ, క్రికెట్ దిగ్గజాలకు కూడీ బీజేపీ లైన్ వేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా బెంగాలీ నటుడు యష్ దాస్ గుప్తా గత వారం బీజేపీలో చేరారు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు, దాదా సౌరబ్ గంగూలీని బీజేపీలో చేర్చుకునేందుకు కమల నాథులు తీవ్రంగా యత్నించారు. అయితే.. కారణాలేవైతేనేం గంగూళీ రెండు సార్లు గుండె నొప్పితో ఆసుపత్రి పాలవడంతో ఆయనపై ఒత్తిడి చేస్తే మొదటికే మోసం రావచ్చన్న ఆలోచనతో బీజేపీ గంగూలీని వదిలేసినట్లు సమాచారం.

బీజేపీ ఇలా దూకుడు ప్రదర్శిస్తుంటే దీదీ మాత్రం మొక్కవోని ధైర్యంతో వ్యూహరచన కొనసాగిస్తున్నారు. ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తూనే వున్నారు. తాజాగా బెంగాల్ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామంటూ దానికి కేంద్రం సాయాన్ని అర్థించారు దీదీ. మార్చి మొదటి వారంలోగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంటే ప్రజాకర్షక పథకాల ప్రకటనలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బిజీబిజీగా వున్నారు. ఇదంతా ఒకెత్తైతే.. బీజేపీ అధినేతలు రాష్ట్రానికి వస్తే వీలైనంత మేరకు అడ్డంకులు సృష్టించేందుకు టీఎంసీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక అధినేత్రి ప్రోద్బలం వుందన్నది బీజేపీ నేతల ఆరోపణ. ఈ క్రమంలో బెంగాల్ ఎన్నికల ప్రచారం ఇంకా ఎలాంటి ఉదంతాలకు తెరలేపుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ALSO READ: బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు

ALSO READ: డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బైడెన్.. ‘ఆ‘ విధానం మరింత తీవ్రం.. భారత్‌కు లాభమా? నష్టమా?

ALSO READ: తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు.. న్యూ వెరైటీ N440K ఎఫెక్ట్..