Corona Second Wave: తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు.. న్యూ వెరైటీ N440K ఎఫెక్ట్.. సర్కార్ అప్రమత్తం
తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు పొంచి వుంది. ఈ మేరకు జారీ అయిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దులో స్క్రీనింగ్ టెస్టులు మొదలు పెట్టారు. కానీ...
Corona Second Wave threat to Telangana: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తుండడంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులున్న కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చి, పోయే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. కేరళ నుంచి తమ రాష్ట్రంలోకి ప్రజలు విచ్చలవిడిగా రాకుండా వుండేందుకు తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయి. అలాగే తెలంగాణకు పొరుగున వున్న మహారాష్ట్రలోను కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎక్కువగా ప్రజలు రాకపోకలు సాగిస్తూ వుంటారు. బంధుత్వాలు, వ్యాపారాలు చాలా ఎక్కువగా ముడిపడి వుండడంతో నిత్యం వేలాది మంది మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు సాగిస్తూ వుంటారు.
మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి నగరంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. దీనికి కారణం అక్కడ లోకల్ రైళ్ళను నెల రోజుల క్రితం పున: ప్రారంభించడమేనని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ముంబయి నగరంతోపాటు భివాండి, థానే, నవీ ముంబయి, పుణే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, అమరావతి, షోలాపూర్, నాందేడ్, యవత్‌మాల్ నగరాలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నగరాల నుంచి తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాలకు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ నగరాలకు రాకపోకలు నిత్యం వేల సంఖ్యలో వుంటాయి. దీనికి ప్రధాన కారణం ఈ నగరాల నుంచి వ్యాపార, వాణిజ్య సంబంధాలను మహారాష్ట్రకు పెద్ద ఎత్తున వుండడమే.
తాజాగా ముంబయి మహానగరంతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్, అకోలా, షోలాపూర్, కిన్వట్ తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దులో వున్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. దాంతో మహారాష్ట్ర నుంచి ఈ రెండు జిల్లాలకు వచ్చే మార్గాలలో, రహదారులలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను పెట్టి థర్మల్ స్క్రీనింగ్ మొదలు పెట్టారు. కానీ ఈ చర్యలు తూతూ మంత్రంగా వున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రెంజల్, బోధన్, నవీపేట, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, బోధన్ మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోధన్ మండలం సాలుర వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు. అయితే.. ప్రైవేటు వాహనాలపైనా, ద్విచక్ర వాహనాలపైనా వచ్చే వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బస్సుల్లోను, రైళ్ళలోను పెద్ద ఎత్తున వస్తున్న వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. దాంతో పెద్ద ఎత్తున రాకపోకలు సాగే విభాగాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ప్రధాన పట్టణమైన దెగ్లూర్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ వాసులు ఏదో ఓ పనిమీద ప్రతీ రోజు దెగ్లూర్ వెళ్ళి వస్తుంటారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు వ్యాపారులు నాందేడ్, ఔరంగాబాద్, షోలాపూర్, ముంబయి లాంటి నగరాలకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం వెళ్తుంటారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వస్తువులను, వస్త్రాలను దిగుమతి చేసుకొంటారు. బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్, పిట్లం, రెంజల్, నవీపేట మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్వహించే సంతలకు మహారాష్ట్ర నుంచి వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
ప్రస్తుతం మహారాష్ట్రకు నిత్యం ఆరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవికాకుండా వారంలో రెండ్రోజులు నడిచే రైళ్లు మరో నాలుగు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ స్టేషన్‌కు రైలు వచ్చిన సమయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, నిర్మల్, బాసర, ఆదిలాబాద్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ వంటి పట్టణాలకు మహారాష్ట్ర నుంచి ప్రతీ రోజు వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తూ వుంటారు. ఈ బస్టాండ్లలోను కరోనా పరీక్షలు నిర్వహించడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలో మొదలైన కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌కు సంబంధించిన ఎన్440కే, ఎన్484కే ఇప్పటికే తెలంగాణకు చేరిందని సిసిఎంబీ పరిశోధనలలో తేలింది. ఈ కోణంలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ప్రీకాషనరీ స్టెప్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి కేవలం నిజామాబాద్, ఆదిలాబాద్ నగరాలకే కాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి నిత్యం పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఒకట్రెండు చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. ఇవి సరిపోవడం లేదనేది ప్రస్తుతం గ్రౌండ్ పరిస్థితిని పరిశీలిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది వచ్చే అవకాశాలుండగా.. కేవలం పదుల సంఖ్యలో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయడం ద్వారా పరోక్షంగా సెకెండ్ వేవ్ కరోనాను ఆహ్వానించినట్లేనని వారంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి కొనసాగుతున్న రాకపోకలపై తాత్కాలికంగానైనా స్క్రీనింగ్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచిస్తున్నారు.
ALSO READ: 2 రాష్ట్రాల్లోనే 75% శాతం కేసులు.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం?