ఏసీబీ గాలంకి చిక్కిన రూ.100 కోట్ల అవినీతి తిమింగలం.. ఏకంగా 3 రాష్ట్రాల్లో అక్రమాస్తులు!
ACB searches Rangareddy land records office in DA case, Assets worth Rs. 100 crore seized: రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే శ్రీనివాస్ అవినితి చిట్టా ఇది. ఏపీబీ అధికారులు పకడ్భందీగా కాపుకాసి గురువారం (డిసెంబర్ 4) ఆయన కార్యాలయం, ఇల్లు, బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లతో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో..

హైదరాబాద్, డిసెంబర్ 5: పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని యేళ్లుగా అవినీతికి అలవాటు పడిన మరో బడా తిమింగలం ఏసీబీ గాలంకి చిక్కింది. ఏకంగా రూ.100 కోట్లు కూడబెట్టడంతో అధికారులు కూడా షాకయ్యారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు. రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే శ్రీనివాస్ అవినితి చిట్టా ఇది. ఏపీబీ అధికారులు పకడ్భందీగా కాపుకాసి గురువారం (డిసెంబర్ 4) ఆయన కార్యాలయం, ఇల్లు, బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లతో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఈ యవ్వారం బయటపడింది. ఈ క్రమంలో రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో బయటపడ్డ శ్రీనివాసులు అక్రమాస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకు పైమాటేనని లెక్కతేల్చారు.
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు కార్యాలయంలో ఏసీబీ అధికారులు 10 గంటలపాటు సోదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపారు. ఏడీ శ్రీనివాసులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలు వెనకేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మణికొండ, నార్సింగి, వట్టినాగులపల్లితోపాటు పలు ప్రాంతాల్లో భూవివాదాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు రాయదుర్గంలోని మైహోమ్ భుజలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
గతంలో నల్లగొండ జిల్లాలో పని చేస్తున్నప్పుడు శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపితే.. పైఅధికారులు కుమ్మక్కై శిక్షించడానికి బదులు రంగారెడ్డి జిల్లా ఏడీగా మరో కీలక స్థానానికి బదిలీ చేశారు. అప్పట్నుంచి శ్రీనివాసులు మరింత రెచ్చిపోయి అందినకాడికి భారీగా కూడబెట్టుకున్నాడు. అంతేకాదు శ్రీనివాసులు పనిచేసిన ప్రతీచోట అతడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రాసాగాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టింది
ఏసీబీ గుర్తించిన శ్రీనివాసులు ఆక్రమాస్తుల చిట్టా ఇదే..
హైదరాబాద్‌లోని మై హోమ్ భుజలో ఒక ఫ్లాట్, నారాయణపేట జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్/ రైస్‌మిల్లు, కర్నాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ఇళ్ల స్థలాలు, నారాయణపేట జిల్లాలో 3 ఇళ్ల స్థలాలు, రూ.5 లక్షల నగదు, 1.6 కేజీల బంగారం, 770 గ్రాముల వెండి, ఒక కియా సెల్టోస్ హైక్లాస్ కారు, ఒక టయోటా ఇన్నోవా కారు.. వీటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




